ఢిల్లీలో వాన బీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు.. 49 దారి మళ్లింపు

ఢిల్లీలో వాన బీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు.. 49 దారి మళ్లింపు

ఢిల్లీలో వాన దంచికొట్టింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన ఢిల్లీని అతలాకుతలం చేసింది. భారీ వర్షం దెబ్బకు ఢిల్లీ వీధులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ చిన్నపాటి వాగుల్లా దర్శనమిచ్చాయి. తీవ్రమైన గాలులకు చెట్లు వేళ్లతో సహా ఊడి కిందపడ్డాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం రాజధానిలో 82 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచాయి. దీంతో చెట్లు కూలిపడటంతో పలు చోట్ల కరెంటు వైర్లు తెగిపడ్డాయి. కొన్ని ఏరియాల్లో కరెంటు సప్లై నిలిచిపోయింది. రాత్రంతా కురిసిన వర్షానికి ఢిల్లీ జలమయం అయ్యింది.

శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5.30 వరకు 81.2 మిల్లీ మీటర్ల భారీ వర్షానికి ఢిల్లీలో కొన్ని ఏరియాలు నీట మునిగాయి. మోతీ బాగ్, మింటో రోడ్, ఢిల్లీ కంటోన్ మెంట్, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్ ప్రాంతాలు జలమయమయ్యాయి. 

బలమైన ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఢిల్లీలో రవాణా స్థంభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 100కు పైగా విమానాలు రద్దు చేశారు. రాత్రి 11.30 నుంచి ఉదయం 4 గంటల ప్రాంతంలో 49 విమానాలను దారిమళ్లించారు ఎయిర్ పోర్ట్ అధికారులు.