వారంలోపే 2 కోట్ల మందికి టీనేజర్లకు టీకా

వారంలోపే 2 కోట్ల మందికి టీనేజర్లకు టీకా

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే 150 కోట్లకు పైగా డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కాగా.. జనవరి 3న మొదలుపెట్టిన టీనేజర్ల వ్యాక్సినేషన్‌ కూడా  జోరుగా నడుస్తోంది. 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ మొదలుపెట్టి వారం రోజులు కూడా కాకముందే 2 కోట్ల మందికి ఫస్ట్ డోసు వ్యాక్సిన్ వేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ రోజు ఉదయం వరకు దేశంలో మొత్తంగా 150.61 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. గడిచిన 24 గంటల్లోనే 90 లక్షల 59 వేల డోసుల వ్యాక్సిన్‌ వేసినట్లు చెప్పారు.

కాగా, దేశంలో కరోనా కేసుల వ్యాప్తి తీవ్రమవుతోంది. దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఓవైపు కరోనా, మరోవైపు డెల్టా వేరియంట్ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కరోనా కేసులు లక్ష దాటాయి. ఒక్క రోజే లక్షా 41 వేల 986 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 21.3 శాతం కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో 40 వేల 925, పశ్చిమబెంగాల్ లో 18వేల 213, ఢిల్లీలో 17వేల 335, తమిళనాడులో 8 వేల 921, కర్నాటకలో 8 వేల 449 మందికి కరోనా సోకింది. 40 వేల 895 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 285మంది చనిపోయారు. డైలీ పాజిటివీ రేటు 9.28శాతంగా నమోదు అయింది. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 72 వేల 169 యాక్టివ్ కేసులు ఉన్నాయి.