నైజీరియాలో నరమేధం.. మిలిటెంట్ల కాల్పుల్లో 30 మందికి పైగా మృతి

నైజీరియాలో నరమేధం.. మిలిటెంట్ల కాల్పుల్లో 30 మందికి పైగా మృతి

అబుజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. ఆదివారం (జనవరి 4) నైజర్ రాష్ట్రంలోని కసువాన్-డాజీ అనే మారుమూల గ్రామంపై తుపాకులతో విరుచుకుపడ్డారు. ఇండ్లు, మార్కెటే లక్ష్యంగా ముష్కరులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ మారణహోమంలో కనీసం 30 మంది గ్రామస్తులు చనిపోగా.. అనేక మందిని దుండగులు అపహరించుకుపోయారు. 

ఈ దాడిని స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులను ఉటంకిస్తూ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ఈ ఘటనను నివేదించింది. నైజర్ రాష్ట్రంలోని మారుమూల కసువాన్-దాజీ గ్రామంలో ఈ దాడి జరిగిందని తెలిపారు. దుండగులు భారీ ఆయుధాలతో గ్రామంలోకి చొరబడి నివాసితులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్థానిక మార్కెట్, అనేక ఇళ్లను కూడా తగలబెట్టారు. ఈ ఘటనలో కనీసం 30 మంది గ్రామస్తులు మరణించగా, అనేక మంది అపహరణకు గురయ్యారని తెలిపారు.

Also Read : వాయు, జల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి

 అపహరణకు గురైన వారిని వెతకడానికి, గ్రామంలో ప్రశాంతతను పునరుద్ధరించడానికి భద్రతా సిబ్బందిని ఆ ప్రాంతంలో మోహరించినట్లు తెలిపారు. పోలీసుల వాదన ఇలా ఉంటే స్థానికుల వాదన మరోలా ఉంది. ఈ దాడిలో మృతుల సంఖ్య గణనీయంగా ఉందన్నారు. కనీసం 40 మందికి పైగానే మరణించారని స్థానికులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అపహరణకు గురైన వారిలో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని చెప్పారు.