
హైదరాబాద్ సిటీ, వెలుగు:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గతంలో లేని విధంగా ఈ సారి 300కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం (అక్టోబర్ 21) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు.
అందుకోసం ప్రత్యేకంగా టోకెన్లు కేటాయించి అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. అధికారులు ప్రక్రియను స్పీడప్చేసి గంటకు 10 నుంచి 12 నామినేషన్ల వరకు స్వీకరించారు. చివరిరోజు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మూడో సెట్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నాలుగో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రెండో సెట్ నామినేషన్ సమర్పించారు.
చివరి రోజు మంగళవారం 189 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతకు ముందు 94 మంది నుంచి 127 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్లు వేసిన వారిలో ట్రిపుల్ఆర్ బాధితులు, నిరుద్యోగులు, మాల సంఘం నాయకులు ఉన్నారు. బుధవారం నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఈ నెల 24 వరకు నామినేషన్ల విత్‌డ్రాకు చాన్స్ ఉంటుంది. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.