భారీ ప్యాసింజర్ జెట్ విమానాలు అంటే మొదటగా గుర్తుకొచ్చే పేరు బోయింగ్. ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా ఎయిర్ లైన్ కంపెనీలన్నింటికీ ఈ కంపెనీ విమానాలను సరఫరా చేస్తోంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఒకప్పుడు ఆ దేశం ప్రపంచంలోనే టాప్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి సైతం తోడ్పడిందనీ చెప్తుంటారు. కానీ.. ఇప్పుడు బోయింగ్ కంపెనీ డిజైన్ చేసిన ఓ విమానం తయారీకి టెంపరరీగా బ్రేకులు పడ్డాయి. ఎయిర్ బస్ విమానానికి పోటీగా మార్కెట్లోకి వచ్చి టాప్ విమానంగా పేరు పొందిన ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ బోర్డు సోమవారం ప్రకటించింది. దీంతో ఆ కంపెనీ మాత్రమే కాదు.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడనుంది. అనేక చిన్న ఎయిర్ లైన్ కంపెనీలపైనా ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది.
ఎందుకు బ్రేకులు పడ్డాయి?
బోయింగ్ కంపెనీ దాదాపు 300కు పైగా 737 మ్యాక్స్ విమానాలను వివిధ దేశాలకు చెందిన చాలా కంపెనీలకు అమ్మింది. అవి కాకుండా మరో 400కు పైగా విమానాలను తయారు చేసి, అమ్మేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఆ విమానాలన్నీ కంపెనీ వద్దే మూలకు పడున్నాయి. 2018 అక్టోబరులో బోయింగ్ 737 మ్యాక్స్ విమానం టేకాఫ్ అయిన10 నిమిషాల్లోనే ఇండోనేసియా సముద్రంలో కూలిపోయింది. ఈ ఏడాది మార్చిలో ఇథియోపియా ఎయిర్ లైన్స్‌కు చెందిన మరో విమానమూ టేకాఫ్ అయిన 8 నిమిషాలకే క్రాష్ ల్యాండ్ అయింది. ఈ రెండు సంఘటనల్లో మొత్తం 300కుపైగా ప్రయాణికులు చనిపోయారు. ఈ విమానం తయారీలో లోపాల కారణంగానే ప్రమాదాలు జరిగాయని తేలింది. దీంతో ఈ విమానాలకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులను నిరాకరించింది. తిరిగి అనుమతులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదు.
సాఫ్ట్‌వేర్ లోపం.. రూ.63 వేల కోట్ల నష్టం
విమానం ఎగురుతున్నప్పుడు ముందు, వెనక భాగాలను పైలెట్లు బ్యాలెన్స్ చేస్తుంటారు. దీనిని ఆటోమేటిక్‌గా కంప్యూటర్ సిస్టం ద్వారా జరిగేలా చేసేందుకు బోయింగ్ 737 మ్యాక్స్ లో ప్రత్యేకమైన ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో మానువరింగ్ క్యారక్టరిస్టిక్స్ ఆగ్మెంటేషన్ సిస్టం (ఎంసీఏఎస్) అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్ స్టాల్ చేశారు. ఆ సాఫ్ట్‌వేర్‌లో లోపం ఉందని నిపుణులు చెప్తున్నారు. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ ఆ కంపెనీ చేసిన ప్రకటన తర్వాత సోమవారం దాని షేరు విలువ 4 శాతం పడిపోయింది. దీంతో ఆ కంపెనీకి 900 కోట్ల డాలర్ల మేరకు (రూ. 63 వేల కోట్లు) నష్టం వచ్చినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, బోయింగ్ లో 12 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మ్యాక్స్ విమానాల తయారీని నిలిపేసినా, ఉద్యోగులను మాత్రం తీసేయబోమని కంపెనీ ప్రకటించింది.

