రేప్​ బాధితుల హెల్ప్​లైన్​కు 2 వారాల్లో 400కుపైగా ఫోన్లు

రేప్​ బాధితుల హెల్ప్​లైన్​కు 2 వారాల్లో 400కుపైగా ఫోన్లు
  • రేప్​ బాధితుల హెల్ప్​లైన్​కు 2 వారాల్లో 400కుపైగా ఫోన్లు
  • ఉక్రెయిన్​లో రష్యన్ సైన్యం అఘాయిత్యాలకు ఇదే సాక్ష్యం 
  • మహిళలు, బాలికలపై విచ్చలవిడిగా అత్యాచారాలు 
  • ఉక్రెయిన్ మానవ హక్కుల కమిషనర్ ఆందోళన

కీవ్ : ఉక్రెయిన్ మహిళలపై రష్యన్ సోల్జర్లు యథేచ్ఛగా లైంగిక దాడులకు తెగబడుతున్నారని ఆ దేశ మానవ హక్కుల సంఘం కమిషనర్ ల్యూద్మిలా డెనిసోవా ఆందోళన వ్యక్తంచేశారు. గత రెండు వారాల టైంలోనే 400కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఆమె వెల్లడించారు. బాధితులకు సహాయం కోసం యూనిసెఫ్ సహకారంతో ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్​కు ఈ నెల 1 నుంచి 14 మధ్యనే 400కు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. అయితే, బయటకు చెప్పుకోని బాధితులు ఇంకా ఎంతో మంది ఉన్నారన్నారు. 

ప్రెగ్నెంట్ బాలికపై దారుణం.. 
ఖేర్సన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల ప్రెగ్నెంట్ బాలికపై మద్యం తాగిన ఓ రష్యన్ సోల్జర్ దారుణానికి ఒడిగట్టాడని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. బాధితురాలు తన కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోని బేస్​మెంట్​లో షెల్టర్ తీసుకుంటోందని, ఇటీవల ఓ రోజు సాయంత్రం తిండి కోసమని బయటకు రావడంతో రష్యన్ సోల్జర్ కంటపడిందని తెలిపారు. మద్యం తాగి ఉన్న ఆ సోల్జర్ బాలికపై అత్యాచారం చేశాడని, ఒప్పుకోకపోతే మరో 20 మందిని పిలుస్తానంటూ బెదిరించాడని పేర్కొన్నారు. 

రష్యన్ యుద్ధట్యాంకుల్లో లోపాలు 
ఉక్రెయిన్​లో యుద్ధానికి పంపిన రష్యా యుద్ధట్యాంకుల్లో లోపాల వల్ల వాటంతట అవే నాశనం అవుతున్నాయని బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ సోల్జర్ల దాడిలోనే కాకుండా.. పేలుళ్ల వల్ల గట్టిగా షాక్ వేవ్స్ వచ్చినా.. ఆ ట్యాంకుల్లోని షెల్స్, పేలుడు పదార్థాలు విస్ఫోటనం చెంది ట్యాంకులు పేలుతున్నాయని తెలిపింది. 

అర్థంలేని యుద్ధమిది : యూఎన్​ చీఫ్​

ఉక్రెయిన్​పై రష్యా చేపట్టిన యుద్ధం 21వ శతాబ్దంలోనే అర్థంలేని యుద్ధమని యూఎన్​ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. యుద్ధనేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో జరుగుతున్న విచారణకు రష్యా సహకరించాలని స్పష్టంచేశారు. గురువారం కీవ్​లో పర్యటించిన ఆయన.. బుచా సిటీ సహా ఇతర పట్టణాలు, గ్రామాలను పరిశీలించారు. బొరోడియాంక టౌన్​లో జరిగిన విధ్వంసంపై ఆయన చలించిపోయారు. అనంతరం రాజధాని కీవ్ లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీతోనూ గుటెరస్ భేటీ అయ్యారు.

ఫిన్లాండ్, స్వీడన్​లను వెంటనే చేర్చుకుంటం : నాటో చీఫ్​ 
నాటో కూటమిలో చేరాలని ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు కోరుకుంటే వెంటనే చేర్చుకుంటామని నాటో సెక్రటరీ జనరల్​జెన్స్ స్టోల్టెన్ బర్గ్ అన్నారు. ఆ రెండు దేశాలకు వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, నాటోలో చేరడంపై ఆ దేశాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా, ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర నేపథ్యంలో రష్యాకు బార్డర్​లోనే ఉన్న ఫిన్లాండ్, ఆ పక్కనే ఉన్న స్వీడన్ నాటోలో చేరే దిశగా ఆలోచిస్తున్నాయి.