
- పార్లమెంటులో వెల్లడించిన పాకిస్తాన్ హోంమంత్రి నక్వీ
- తాజా ఘటనతో అంతర్జాతీయంగా తలవంపులు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మరో తలవంపు జరిగింది. సౌదీ అరేబియా, ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతర్, యూఏఈ లాంటి ముస్లిం దేశాలు దాదాపు 5402 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను తమ దేశాల నుంచి తరమేశాయి. వారిని మళ్లీపాకిస్తాన్కు పంపాయి. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ హోంమంత్రి మొహ్సిన్ నక్వీ ఆ దేశ పార్లమెంటులో వెల్లడించారు. ఇప్పటికే విదేశాలకు బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా ఒక అపకీర్తి ఉంది. ఈ తాజా ఘటన పాక్‌కు అంతర్జాతీయ సమాజంలో మరింత చులకనగా మార్చింది. బిచ్చమెత్తడం, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి కారణాలతో పై ముస్లిం దేశాలు పాకిస్తాన్ వారిని వెనక్కి పంపినట్టు తెలుస్తున్నది. ఒక్క సౌదీ అరేబియా దేశమే వేలాది మందిని వెనక్కి పంపింది. ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతర్, యూఏఈ కూడా ఇలాంటి చర్యలే చేపడుతున్నాయి. ఈ దేశాలు పాక్ బిచ్చగాళ్లను నియంత్రించేందుకు కొత్తగా కఠినమైన నిబంధనలు తెచ్చాయి.
అంతర్జాతీయ బిచ్చగాళ్ల దేశంగా..
పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. కొందరు ఉద్యోగాల కోసం వెళ్లినా, చాలా మంది బిచ్చమెత్తడం, చిన్న చిన్న నేరాల్లో పాల్గొనడం వంటివి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేశాయి. కొద్దిరోజుల కింద పాక్ పార్లమెంట్లులో ఆ దేశ హోంమంత్రి నక్వీ ఈ డిపోర్టేషన్ కు సంబంధించిన గణాంకాలు వెల్లడించారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, తీవ్ర విమర్శలు వచ్చాయి.
కొందరు పాక్‌ను “అంతర్జాతీయ బిచ్చగాళ్ల దేశం”గా పేర్కొంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. మరోవైపు ఈ డిపోర్టేషన్‌లు పాకిస్తాన్‌పై ఆర్థిక, సామాజిక ఒత్తిడిని మరింత పెంచాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పాక్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.