24 గంటల్లో ..700 మంది మృతి

24 గంటల్లో ..700 మంది మృతి
  • గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. హమాస్ నిర్మూలనే లక్ష్యం: నెతన్యాహు

టెల్ అవీవ్ :  దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం దాడులను తీవ్రతరం చేసింది.  గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 700 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్  ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య కుదిరిన ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారంతో ముగియగానే ఇజ్రాయెల్ దాడులను తిరిగి షురూ చేసింది. దేశంలోనే రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ స్థాయి బాంబు పేలుళ్లు సంభవించాయి. దీంతో పౌరులందరు ఆ ప్రాంతాలను వదిలి వెళ్లాలని మిలిటరీ కోరింది. దక్షిణం వైపు లేదా పశ్చిమానికి వెళ్లాలని సూచించింది.

గాజాలో ఆపరేషన్స్ విస్తరిస్తున్న ఇజ్రాయెల్

హమాస్ కు వ్యతిరేకంగా గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్ ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) విస్తృతం చేస్తున్నాయని  ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి తెలిపారు. టెర్రరిస్టులతో తలపడి వారిని చంపేస్తామని హెచ్చరించారు. ఈ వారాంతంలో 400కు పైగా టార్గెట్స్​ను ఛేదించాలని ఇజ్రాయెల్ మిలిటరీ లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఐలాన్ లెవీ పేర్కొన్నారు. ఖాన్ యూనిస్ ప్రాంతంలో వైమానిక దాడులను తీవ్రతరం చేయాలని మిలిటరీ నిర్ణయించుకుందన్నారు. ఇప్పటికే హమాస్ మిలిటెంట్లను హతమార్చడంతో పాటు బీట్ లాహియాలో ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ను మిలిటరీ ధ్వంసం చేసింది. గాజాపై దాడులను తీవ్రతరం చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మిలిటరీ శనివారం రాత్రి ఆదేశాలిచ్చారు. హమాస్ ను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమన్నారు.

15 వేల మందికి పైగా మృతి

ఇజ్రాయెల్  దాడులు షురూ చేసిన తర్వాత భారీగా ప్రజలు తరలి వెళ్లారని యూఎన్​ తెలిపింది. ఇలా వెళ్లిన వారి సంఖ్య ప్రస్తుతం 18 లక్షలకు చేరుకుందని చెప్పింది. యుద్ధం మొదలైనంక 15,523 మంది పాలస్తీనియన్లు చనిపోయారని హమాస్ చెప్పింది. మరణించిన వారిలో 70 శాతానికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నారని పేర్కొంది.