సగానికిపైగా పంచాయతీ స్థానాలు బీసీలకే : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

సగానికిపైగా పంచాయతీ స్థానాలు బీసీలకే : ఎమ్మెల్యే భూపతిరెడ్డి
  •     రూరల్ ​ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్ రూరల్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించామని రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.  రూరల్​ నియోజకవర్గంలో 170 పంచాయతీలుండగా 44 పంచాయతీల్లో వంద శాతం ఎస్టీలు ఉండడంతో అవన్నీ ఎస్టీలకు రిజర్వు అయ్యాయన్నారు. 

మిగతా126 స్థానాల్లో 62 స్థానాలు రిజర్వు కాగా, ఓపెన్​ కేటగిరీలో ఉన్న 64 స్థానాల నుంచి 32 స్థానాలను బీసీలకు కేటాయించామని తెలిపారు. సర్పంచ్​ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు అభ్యర్థులు దొరకడం లేదని, చాలా చోట్ల రెండు పార్టీలు కుమ్మక్కై పోటీ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. 

రెండేళ్ల తమ పాలనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని సర్పంచ్​ఎన్నికల్లో క్లీన్​స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ పాలక వర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం రూ.10 లక్షల నజరానా ఇస్తుందని, వాటికి తోడు ఎమ్మెల్యే కోటా నుంచి రూ.20 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, పీసీసీ డెలిగేట్ శేఖర్​గౌడ్​, బాగారెడ్డి పాల్గొన్నారు.