లైఫ్ జాకెట్లు లేవు, సేఫ్టీ సర్టిఫికేట్ లేదు.. బోటు బోల్తాకు కారణాలు అవేనా..

లైఫ్ జాకెట్లు లేవు, సేఫ్టీ సర్టిఫికేట్ లేదు..  బోటు బోల్తాకు కారణాలు అవేనా..

కేరళలో మలప్పురం జిల్లాలో జరిగిన బోటు బోల్తా ఘటనలో మహిళలు, పిల్లలతో సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటను ప్రధానంగా 'అధిక రద్దీ' కారణమని మలప్పురం పోలీసులు తెలిపారు. ఈ విషాదం వెనుక దాగిన అసలైన కారణాన్ని మాత్రం పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన తర్వాత దర్యాప్తు ప్రారంభిస్తామని వారు స్పష్టం చేశారు..

మలప్పురం పోలీసులు మాట్లాడుతూ, "రెస్క్యూ ఆపరేషన్స్ ముగిసిన తర్వాత మేము దర్యాప్తు ప్రారంభిస్తాము. దీనికి కారణం అధిక రద్దీ అయి ఉండవచ్చు. ప్రస్తుతానికి దాన్ని కూడా నిర్ధారించలేము. ప్రమాదం జరిగినప్పటి నుంచి పడవ యజమాని నాజర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చేపట్టాం" అని వెల్లడించారు. అంతకుముందు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) ఎమ్మెల్యే పికె కున్హాలికుట్టి కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఓడ బోల్తా పడటానికి రద్దీ కారణమని భావిస్తున్నట్టు చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత బోట్లు రైడింగ్ కోసం బయటకు వెళ్లకూడదని, కానీ ఈ కేసులో నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోందని తెలిపారు,

పలు నివేదికల ప్రకారం, పడవ అధికారిక గడువు సాయంత్రం 5 గంటలు అయిపోయినా పడవ వాగులో సంచరించింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఈ పడవ మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఘటన సమయంలో పడవలో 30కి పైగా మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

లైఫ్ జాకెట్లు లేవు, సేఫ్టీ సర్టిఫికేట్ లేదు

మీడియా కథనాల ప్రకారం, బోట్ యజమాని పర్యాటక సేవల కోసం ఫిషింగ్ బోట్‌ను మార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టూరిస్ట్ బోట్‌లకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండానే బోటు నడిపినట్లు అధికారులు తెలిపారు.

పడవలో ప్రయాణీకుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా తెలియనప్పటికీ, 40 మంది టిక్కెట్లతో ఉన్నారని, వారితో పాటు ఇంకా చాలా మంది ప్రయాణికులు ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. పడవకు భద్రతా ప్రమాణపత్రం కూడా లేదని నివేదికలు పేర్కొన్నాయి.

కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్..

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇండియన్ నేవీకి చెందిన చేతక్ హెలికాప్టర్‌ కూడా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.  

మలప్పురం జిల్లాలో విషాదం జరిగిన సంఘటనా స్థలానికి కేరళ రెవెన్యూ మంత్రి కె రాజన్ చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు సమాచారం. అంతకుముందు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 8న సంతాప దినం ప్రకటించి అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది.