వికసిత్ ​భారత్​లక్ష్యం చేరుకునేందుకు యూత్ రాజకీయాల్లోకి రావాలి: ప్రధాని మోదీ

వికసిత్ ​భారత్​లక్ష్యం చేరుకునేందుకు యూత్ రాజకీయాల్లోకి రావాలి: ప్రధాని మోదీ
  • వారసత్వ రాజకీయాలు యంగ్ టాలెంట్​ను అణచివేస్తున్నాయి
  • దేశ అభివృద్ధికి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని చాటాలి
  • అంతరిక్ష రంగంలో భారత్​ దూసుకెళ్తున్నది
  • చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా నిలిచినం
  • తెలుగు ప్రజలకు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
  • 113వ మన్​ కీ బాత్ లో మోదీ 

న్యూఢిల్లీ: ఎలాంటి నేపథ్యంలేని యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని మోదీ మరోసారి పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి, భవిష్యత్తుతోపాటు వికసిత్​ భారత్​ లక్ష్యం సాధించేందుకు ఇది అవసరమని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు యంగ్​ టాలెంట్​ను అణచివేస్తున్నాయని తెలిపారు. ఆదివారం ప్రసారమైన 113వ ‘మన్‌‌ కీ బాత్‌‌’  ఎపిసోడ్‌‌లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అభివృద్ధి చెందిన భారత్‌‌, బలమైన ప్రజాస్వామ్యం కోసం యువత ప్రజా జీవితంలోకి రావాలని అన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువత పాలిటిక్స్​లోకి రావాలని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటనుంచి తాను ఇచ్చిన పిలుపునకు విస్తృత స్పందన వచ్చిందని పేర్కొన్నారు. పలువురు యువత సోషల్​మీడియాలో సూచనలు ఇవ్వడమేగాక తనకు లేఖలు రాశారని చెప్పారు. ఇది నిజంగా తాము ఊహించలేదని పలువురు లేఖల్లో పేర్కొన్నట్టు చెప్పారు. 

స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని చాటాలి

ఎలాంటి పొలిటికల్​ బ్యాక్​గ్రౌండ్​ లేకున్నా అనేక మంద్రి ప్రజలు దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారని మోదీ తెలిపారు. వికసిత్​ భారత్​ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పుడు కూడా అదే స్ఫూర్తిని చాటాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు మోదీ తెలిపారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శకత్వం అవసరమని పేర్కొన్నారు. ఈ అంశంపై సలహాలు పంపినవారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు.  

అంతరిక్ష రంగంలో సంస్కరణలతో యువతకు లబ్ధి

ఈ ప్రోగ్రామ్​లో భాగంగా మోదీ.. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు, గెలాక్సీ ఐ స్పేస్​స్టార్టప్​కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. భారత్​అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్నదని గుర్తుచేశారు. ఈ రంగంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో యువత పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్టు వెల్లడించారు. చంద్రయాన్​–3 విజయానికి గుర్తుగా ఈ నెల 23న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నామని గుర్తుచేశారు.  చంద్రుడి దక్షిణ ధ్రువం (శివశక్తి పాయింట్​)పై కాలుమోపిన తొలి దేశంగా భారత్‌‌ నిలిచిందని అన్నారు. అంతరిక్ష రంగం యువతను ఆకర్షిస్తున్నదని చెప్పారు. 

హర్​ఘర్​ తిరంగా, పూరా దేశ్​ తిరంగా సక్సెస్

ఈ ఏడాది హర్​ఘర్​తిరంగా, పూరా దేశ్​ తిరంగా కార్యక్రమాలు సక్సెస్​ అయ్యాయని మోదీ తెలిపారు. ఇండ్లు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, దుకాణాలు, ఆఫీసులపై త్రివర్ణ పతాకం రెపరెపలాడిందని అన్నారు. తన పిలుపు మేరకు కోట్లాది మంది జాతీయ జెండాలతో ఫొటోలు దిగి వెబ్​సైట్​లో  అప్​లోడ్​ చేశారని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం ఓ సామాజిక వేడుకగా మారిందని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై 750 మీటర్ల పొడవున్న జెండాతో తిరంగా ర్యాలీని కూడా తీశారని చెప్పారు. శ్రీనగర్​లోని దాల్​ సరస్సుతోపాటు దేశంలోని వివిధ చోట్ల జరిగిన తిరంగా యాత్రలను ప్రస్తావించారు.

తెలుగు.. అద్భుతమైన భాష

తెలుగు.. అద్భుతమైన భాష అని మోదీ అన్నారు. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు, మహిళల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. అలాగే, వర్షపు నీటిని ఒడిసిపట్టి కాపాడుకునేందుకు ఉద్దేశించిన ‘క్యాచ్​ ద రెయిన్ మూవ్​మెంట్’​లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పారిస్​లో పారాలింపిక్స్​ప్రారంభం కానున్నాయని, ఇందులో పాల్గొనేందుకు దేశానికి చెందిన దివ్యాంగ క్రీడాకారులు అక్కడికి చేరుకున్నారని చెప్పారు. వారిని 140 కోట్లమంది భారతీయులు ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.