నీళ్లు, నిధులు, నియామకాల్లో బీఆర్ఎస్ విఫలం : పి.సుదర్శన్ రెడ్డి

నీళ్లు, నిధులు, నియామకాల్లో బీఆర్ఎస్ విఫలం : పి.సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు : తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను అందించడంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఎడపల్లి మండలకేంద్రంలో ఎన్​ఎస్​యూఐ నాయకుడు రత్నాకర్​ని కలిసిన మాజీ మంత్రి, ఆయన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తే  యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశ పడ్డారని, కానీ  ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరిట  రూ. లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందని పేర్కొన్నారు.

సబ్సిడీ లోన్లు, సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయకపోవడం వల్ల  రైతాంగం తీవ్రంగా నష్టపోయారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తుందని తెలిపారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హుందాన్, ఎడపల్లి మండలాధ్యక్షుడు పులి శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈరాంటి లింగం, లీడర్లు కామప్ప, సాయిరెడ్డి, గంగాధర్, ఫర్హాన్ పాల్గొన్నారు