ఆగస్టు 22న పీఏసీ సమావేశం

ఆగస్టు 22న పీఏసీ సమావేశం
  •     బీసీ రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎన్నికలు, తెలంగాణపై కేంద్రం వివక్ష వంటి అంశాలపై చర్చ

హైదరాబాద్, వెలుగు: పీసీసీలో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) మీటింగ్​కు తేదీ ఖరారైంది. ఈ నెల 22న గాంధీ భవన్ లో నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 16 లేదా 17న ఈ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా 22కు వాయిదా పడింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్, మంత్రులు, పీఏసీ సభ్యులైన సీనియర్​ నేతలు హాజరుకానున్నారు.

బీసీ బిల్లులు, పంచాయతీరాజ్​చట్ట సవరణ ఆర్డినెన్స్​ రెండూ రాష్ట్రపతి వద్ద పెండింగ్​పడిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎలా ముందుకువెళ్లాలో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పార్టీ తరఫున బీసీ రిజర్వేషన్లు ప్రకటించి మిగిలిన పార్టీలపై ఒత్తిడి తేవాలనే ఆలోచన ఉండగా, దీనిపై సీనియర్ల అభిప్రాయాలను హైకమాండ్​ తీసుకోనున్నట్లు తెలిసింది.

ఇక కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా తెలంగాణపై వివక్షపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలుపాలనే అంశంపైనా పీఏసీలో చర్చ ఉంటుందని భావిస్తున్నారు.