
మెదక్ (శివ్వంపేట)/తూప్రాన్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మెదక్‌జిల్లా శివ్వంపేట మండలంలో సాయంత్రం కుండపోత కురిసింది. గోమారం, సికింద్లాపూర్ గ్రామాల్లో రోడ్డుపై ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోయింది. శభాష్ పల్లి కొనుగోలు కేంద్రంలో నీరు నిలిచి వడ్ల సంచులు తడిసి ముద్దయ్యాయి. వడ్ల కుప్పల చుట్టూ నీరు నిలవడంతో జేసీబీతో కాలువలు తీసి నీటిని బయటకు పంపించారు. ఈదురుగాలులకు సిత్య తండాలో ఒకరి ఇంటి రేకులు గాలికి ఎగిరిపోయి ధ్వంసమయ్యాయి. తూప్రాన్ లో ఈదురుగాలులకు నర్సాపూర్ చౌరస్తాలోని శివాజీ విగ్రహం కింద పడిపోయింది. స్తంభాలు, చెట్లు విరిగిపోయాయి. నాగులపల్లిలో ఓ చెట్టుపై పిడుగు పడింది. రైతుల ధాన్యం తడిసింది.
పిడుగు పడి డెయిలీ లేబర్..
జమ్మికుంట : కరీంనగర్జిల్లా జమ్మికుంట మండలంలోని నాగంపేటలో రామంచ కొమురయ్య(48) అనే డెయిలీ లేబర్పిడుగుపడి చనిపోయాడు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన కొమురయ్య నాగంపేటలోని ఓ పాత ఇనుప సామాన్ దుకాణంలో కూలీగా పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా ఊరి శివారుకు వెళ్లగా వర్షం వస్తుండడంతో మూత్ర విసర్జన చేస్తున్నాడు. అప్పుడే పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య నాగమణి. కొడుకు నరేంద్ర, కూతుళ్లు మౌనిక, స్పందన ఉన్నారు.
కరెంట్ షాక్ తో బాలుడు...
తొగుట, (దౌల్తాబాద్) : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని చెట్ల నర్సంపల్లిలో ఈదురు గాలులకు కరెంటు పోల్ నుంచి వచ్చిన సర్వీస్ వైర్ తెగి షాక్‌కొట్టడంతో ఓ బాలుడు చనిపోయాడు. గ్రామానికి చెందిన పసుల స్వామి, రేణుక కొడుకు వినయ్ (12) గమనించకుండా ఇంట్లో తెగిపడిన వైర్‌పై కాలు పెట్టడంతో షాక్ కొట్టి చనిపోయాడు.