కేసీఆర్ చెప్తే జపాన్లోనైనా పోటీ చేస్త: పద్మారావు గౌడ్

కేసీఆర్ చెప్తే  జపాన్లోనైనా పోటీ చేస్త: పద్మారావు గౌడ్
  • టీఆర్ఎస్​ను వీడే ప్రసక్తే లేదు: పద్మారావు గౌడ్ 
  • నేను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నరు 
  • కిషన్ రెడ్డి కలిసిన పాత వీడియోను వైరల్ చేస్తున్నరు

సికింద్రాబాద్, వెలుగు: టీఆర్ఎస్​ను వీడే ప్రసక్తే లేదని, తుది శ్వాస వరకు ఆ పార్టీలోనే ఉంటానని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ చెప్పారు. సీఎం కేసీఆర్ చెప్తే జపాన్ లో నైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కొద్ది రోజులుగా తాను పార్టీ మారుతునున్నట్లు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ‘‘నాకు టీఆర్ఎస్​లో ఎలాంటి లోటు లేదు. అలాంటప్పుడు పార్టీ ఎందుకు మారుతాను. కేసీఆర్ కుటుంబంతో, టీఆర్ఎస్​తో అనుబంధం ఎప్పటికీ తెగదు” అని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ సీతాఫల్ మండిలోని తన ఆఫీసులో పద్మారావు గౌడ్ మీడియాతో మాట్లాడారు. తాను మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నానని, పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం తీవ్ర ఆవేదన కలిగించిందని ఆయన అన్నారు. ‘‘నా మిత్రుడు రమ్మంటే కుటుంబంతో కలిసి చత్తీస్ గఢ్ వెళ్లాను. ఈ క్రమంలో నేను టీఆర్ఎస్​ను వీడుతున్నట్లు, కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలిసినట్లు సోషల్​మీడియాలో అసత్య ప్రచారం జరిగింది. పార్టీలు వేరైనా కిషన్​రెడ్డితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైమ్ లో మేమిద్దరం పక్క పక్క సీట్లలో కూర్చునే వాళ్లం. నా బిడ్డ పెండ్లికి రావాలని కిషన్ రెడ్డిని ఆహ్వానించాను. ఆ టైమ్​లో ఆయన రాలేకపోయారు. ఆ తర్వాత నా ఇంటికి వచ్చి నా బిడ్డను ఆశీర్వదించి వెళ్లారు. ఈ వీడియో క్లిప్పింగునే వైరల్ చేసి, నేను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేశారు” అని చెప్పారు. 

మునుగోడుపైనే కేటీఆర్​తో చర్చ.. 

మంత్రి కేటీఆర్​తో మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చించానని పద్మారావు గౌడ్ చెప్పారు. ‘‘నేను చత్తీస్ గఢ్ లో ఉండగా కేటీఆర్ ఫోన్ చేశారు. ‘‘చిచ్చా.. రాగానే ఒకసారి నా వద్దకు వచ్చిపోరాదు’’ అన్నారు. దీంతో ఎయిర్ పోర్టు నుంచి డైరెక్టుగా కేటీఆర్ దగ్గరికి వెళ్లాను. మేము మునుగోడు ఎన్నికల ప్రచారంపైనే మాట్లాడుకున్నాం. ఇందులో ఎలాంటి మతలబు లేదు. డిప్యూటీ  స్పీకర్​గా నేను నేరుగా ప్రచారానికి వెళ్లడం కుదరదు. అయితే నా సామాజికవర్గానికి చెందినోళ్లను టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరతాను” అని తెలిపారు. కాగా, టీఆర్ఎస్ లో తనకు సముచిత స్థానం ఉందని పద్మారావు చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో తన కొడుకులను బిజినెస్ లోకి దింపుతానని, వారిలో ఒకరిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని తెలిపారు.