OTT Movies..మొదటిరోజే వెళ్లిపోయింది

OTT Movies..మొదటిరోజే వెళ్లిపోయింది

టైటిల్​ : పద్మిని

డైరెక్షన్​ : సెన్నా హెగ్డే

కాస్ట్ : కున్‌‌చ‌‌కో బొబన్‌‌, అప‌‌ర్ణా బాల‌‌ముర‌‌ళి, మడోన్నా సెబాస్టియన్‌‌, విన్సీ అలోషియస్‌‌, మాళవిక మేనన్‌‌, సజిన్‌‌, అల్తాఫ్ సలీం

లాంగ్వేజ్ : మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ

ప్లాట్​ ఫాం :  నెట్‌‌ఫ్లిక్స్‌‌

రమేశ్‌‌ (కున్‌‌చ‌‌కో బొబన్‌‌) ఓ కాలేజీలో ప్రొఫెసర్​గా పనిచేస్తుంటాడు. అప్పుడప్పుడు కథలు కూడా రాస్తుంటాడు. ముప్పై ఏండ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో బాధపడుతుంటాడు. అదే టైంలో స్మృతి (విన్సీ అలోషియస్‌‌)తో పెళ్లి జరుగుతుంది. ఎన్నో కలలతో పెండ్లి చేసుకున్న రమేశ్​కు ఊహించని షాక్​ తగులుతుంది. ఫస్ట్‌‌నైట్‌‌ రోజు ఇంట్లో కరెంట్‌‌ పోతుంది. దాంతో స్మృతి అలా సరాదాగా కాసేపు బయటికి వెళ్దాం అని అడుగుతుంది. దాంతో రమేశ్​ ఆమెను బయటికి తీసుకెళ్తాడు. కానీ.. బయటికి వెళ్లగానే ఓ కారులో స్మృతి బాయ్‌‌ఫ్రెండ్‌‌ వచ్చి ఆమెని తీసుకెళ్తాడు. ఈ విషయం ఊరందరికీ తెలిసి, అతని మీద జాలి పడుతుంటారు. కొన్నాళ్లకు రమేశ్​ ఆ బాధలో నుంచి బయటికొచ్చి రెండో పెండ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. తర్వాత కాలేజీలో తనతోపాటే  పనిచేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. ఆ అమ్మాయి తరపు బంధువులు అధికారికంగా విడాకులు తీసుకుంటేనే రమేశ్‌‌కు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని షరతు పెడతారు. దాంతో ఎక్కడికెళ్లిందో తెలియని భార్య కోసం రమేశ్​ ఏం చేశాడు? విడాకులు తీసుకున్నాడా? లాయర్​ శ్రీదేవి (అపర్ణా బాలమురళీ) అతనికి ఎలాంటి సాయం చేసింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో డ్రామాతోపాటు కావాల్సినంత కామెడీ  ఉంది. ట్విస్ట్‌‌లు బాగున్నాయి. సజిన్‌‌ చేసిన పరుపుల వ్యాపారి రోల్‌‌ కడుపుబ్బా నవ్విస్తుంది. కున్‌‌చకో బొబన్‌‌ యాక్టింగ్‌‌ చాలా బాగుంది. రమేశ్‌‌ పాత్రలో ఒదిగిపోయాడు. ఫ్యామిలీ కోర్టు లాయర్​గా అపర్ణ బాలమురళి కూడా బాగానే చేసింది. 

తల్లిగా మారాలని..

టైటిల్​ : తాలీ, డైరెక్షన్​ : రవి జాదవ్‌‌

కాస్ట్ : సుస్మితా సేన్‌‌, కృతిక డియో, ఐశ్వర్య నర్కర్‌‌, అంకుర్‌‌ భాటియా, నందు మాధవ్‌‌

లాంగ్వేజ్ : హిందీ, ప్లాట్​ ఫాం :  జియో సినిమా

కొన్నేళ్ల నుంచి బాలీవుడ్‌‌లో బయోపిక్స్‌‌కు డిమాండ్ పెరుగుతోంది. అందుకే బయోపిక్స్‌‌ని వెబ్ సిరీస్‌‌ల్లా కూడా తీస్తున్నారు. ట్రాన్స్‌‌జెండర్ల హక్కుల కోసం న్యాయ పోరాటం చేసిన శ్రీగౌరి సావంత్‌‌ జీవితం ఆధారంగా ఈ తాలీని తీశారు. గణేశ్‌‌ (కృతిక).. ఓ పోలీసు అధికారి కొడుకు. చిన్నప్పటినుంచే అమ్మాయిగా మారాలి అనుకుంటాడు. ‘పెద్దయ్యాక ఏమవుతావ్‌‌?’ అని టీచర్‌‌ అడిగితే అమ్మను అవుతానని సమాధానం చెప్తాడు. అప్పుడే వాళ్ల ఇంట్లోవాళ్లకు అతని గురించి అర్థమవుతుంది. కొన్నాళ్లకు అతని తల్లి చనిపోతుంది. తర్వాత తండ్రి గణేశ్​ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తాడు.  దాంతో గణేశ్‌‌ పదిహేనేండ్ల వయసులో పుణె నుంచి ముంబయికి వెళ్తాడు. సర్జరీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారిపోతాడు. తన పేరు గౌరి (సుస్మితా సేన్) అని పెట్టుకుంటాడు. అయితే.. ఆ తర్వాత తాను అమ్మగా ఎలా మారింది? అనేదే అసలు కథ. ట్రాన్స్‌‌జెండర్‌‌ మనోభావాల్ని తెరపైకి తీసుకొచ్చి.. అందరూ ఆలోచించేలా చేస్తుంది ఈ సిరీస్‌‌. సుస్మితా సేన్‌‌ యాక్టింగ్‌‌ బాగుంది. గణేశ్‌‌గా కృతిక డియో, తండ్రిగా నందు యాదవ్‌‌ బాగా నటించారు. విజువల్స్‌‌ బాగున్నాయి. 

హార్ట్‌‌ కోసం 

టైటిల్​ : హార్ట్ ఆఫ్ స్టోన్ 

డైరెక్షన్​ : టామ్ హార్పర్

కాస్ట్ : గాల్ గాడోట్, అలియా భట్, జేమీ డోర్నాన్, సోఫీ ఒకెనాడో

లాంగ్వేజ్ : ఇంగ్లిష్, తెలుగు డబ్

ప్లాట్​ ఫాం :  నెట్‌‌ఫ్లిక్స్ 

రేచెల్ స్టోన్ (గాల్ గాడోట్) బ్రిటిష్ గూఢచార సంస్థ ఎంఐ6లో స్పైగా పనిచేస్తుంటుంది. ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్న ‘ది ఛార్టర్’ అనే ఇంటర్నేషనల్ ఏజెన్సీ కోసం కూడా పని చేస్తుంది. ఒక మిషన్ కోసం రేచెల్ స్టోన్ ఎంఐ6 టీమ్‌‌తో కలిసి ఇటలీ వెళ్తుంది. కానీ.. ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది. అదే టైంలో ఎంఐ6 కమ్యూనికేషన్ సిస్టమ్‌‌ని ఒక గుర్తు తెలియని వ్యక్తి (ఆలియా భట్) యాక్సెస్‌‌ చేస్తుంది. అయితే.. ఆమె ఎవరనేది తెలుసుకోవడానికి రేచెల్ స్టోన్ ఛార్టర్ సాయం తీసుకుంటుంది. అప్పుడు పుణెకు చెందిన 22 సంవత్సరాల కేయా ధావన్‌‌ సిస్టమ్‌‌లోకి ఎంటర్‌‌‌‌ అయ్యిందని తెలుసుకుంటుంది. అయితే.. అప్పటికే రేచెల్‌‌స్టోన్‌‌ ‘హార్ట్‌‌’ అనే ఒక డివైజ్‌‌ను రక్షిస్తుంటుంది. అది ఒక పనిని ఎలా చేస్తే విజయం సాధిస్తామనేది చెప్తుంది. దానికి కొన్ని మార్పులు చేస్తే.. భవిష్యత్తును కూడా కచ్చితంగా అంచనా వేస్తుంది. అందుకే ఆ హార్ట్‌‌ని సొంతం చేసుకోవడానికి కేయా ధావన్  ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు రేచెల్ ఏం చేసింది? ‘హార్ట్’  కేయా ధావన్‌‌కి చిక్కిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాలి. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. గాల్ గాడోట్ యాక్షన్​ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌‌ బాగుంది. కానీ.. కథ చాలా రొటీన్‌‌గా ఉంది. అలియాభట్‌‌ హాలీవుడ్‌‌లో సత్తా చూపించింది. బాగా నటించి అందరినీ ఆకట్టుకుంది.