తాలిబన్ ఎఫెక్ట్: సీఏఏ చట్టం అవసరం ఇప్పుడు తెలిసిందన్న కేంద్ర మంత్రి

తాలిబన్ ఎఫెక్ట్: సీఏఏ చట్టం అవసరం ఇప్పుడు తెలిసిందన్న కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లలో మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు రెండేళ్ల క్రితం 2019 డిసెంబర్‌‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) అవసరం ఏంటన్నది ప్రస్తుతం అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసేలా చేశాయని కేంద్ర మంత్రి హర్‌‌దీప్‌ సింగ్ పురీ అన్నారు. ఆదివారం ఉదయం కాబూల్‌ నుంచి 168 మందిని ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ విమానం ఢిల్లీకి చేర్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తను కోట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఆ 168 మందిలో 107 మంది ఇండియన్స్ కాగా, మరో 23 మంది అఫ్గాన్‌కు చెందిన సిక్కులు, హిందువులు ఉన్నారు. అక్కడ తాలిబన్ల అరాచకాల దెబ్బకు ఆ దేశం విడిచి భారత్‌కు వచ్చేశారు. అఫ్గాన్‌లో మత పరమైన మైనారిటీలైన వీళ్లకు రక్షణ లేకపోవడంతో భారత్ వచ్చేశారు. దీనిని ప్రస్తావిస్తూ ప్రస్తుతం మన పొరుగున ఉన్న అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సిక్కులు, హిందువులు అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారని, సీఏఏ చట్టం ఎంతటి అవసరమనేది ఈ పరిస్థితులు అందరికీ అర్థమయ్యేలా చేసిందని హర్‌‌దీప్‌ సింగ్ పురీ ట్వీట్ చేశారు.

కాగా, 2019లో సీఏఏ తెచ్చిన సమయంలో కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ చట్టం మతపరమైన వివక్షతో చేశారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి. అన్ని మతాలను సమానంగా చూడాలని డిమాండ్లు చేశాయి. పొరుగు దేశాల్లో ఉండలేక వచ్చేసే ముస్లింలకు కూడా ఇక్కడ పౌరసత్వం ఇచ్చేలా సవరణ చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. అయితే పొరుగున ఉన్న మూడు దేశాలు మస్లిం దేశాలుగా ప్రకటించుకున్నవేనని, అక్కడ మైనారిటీలైన క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులు మతపరమైన హింసకు గురవుతున్నారని, వారికి ఆశ్రయం కల్పించేందుకే సీఏఏ తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచే చెబుతూ వస్తోంది.