బ్రేకింగ్: జమ్ము కాశ్మీర్ LOC దగ్గర పాక్ కాల్పులు.. బార్డర్‎లో యుద్ధ వాతావరణం

బ్రేకింగ్: జమ్ము కాశ్మీర్ LOC దగ్గర పాక్ కాల్పులు.. బార్డర్‎లో యుద్ధ వాతావరణం

శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, దాయాది పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ దుందుడుకు చర్యలతో ఇరు దేశాలు మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. భారత్-పాక్ బార్డర్ ఎల్వోసీ దగ్గర కూడా పాక్ సైనికులు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైనిక పోస్టులపై ఏక పక్షంగా కాల్పులకు దిగారు. గురువారం (ఏప్రిల్ 24) అర్థరాత్రి నుంచి ఎల్వోసీ దగ్గర ఒక్కసారిగా పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

పాక్ సైనికుల కవ్వింపు  చర్యలతో భారత జవాన్లు వెంటనే అప్రమత్తమయ్యారు. అదే రేంజ్‎లో ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు. పాక్ సైనికుల కాల్పులను ధీటుగా తిప్పికొట్టారు. ఉన్నఫళంగా పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టడంతో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) దగ్గర హై టెన్షన్ నెలకొంది. రెండు దేశాలు సరిహద్దు వద్ద భారీగా బలగాలను మెహరించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ‘‘పాకిస్తాన్ సైన్యం ఎల్వోసీ వెంబడి ఉన్న భారత పోస్టులపై చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. మా దళాలు కూడా అంతే ధీటుగా స్పందించాయి. భారత వైపు నుండి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు’’ అని ఒక అధికారి వెల్లడించారు. 

కాగా, జమ్ముకాశ్మీర్‎లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‎గా పిలిచే  పహల్గాంకు కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరిపాయి. ముష్కరుల పాశవిక దాడిలో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు పర్యాటకులు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో దాయాది పాక్, భారత్ మధ్య వివాదం మొదలైంది.