పాకిస్తాన్ పార్లమెంట్ రద్దు..4 నెలల్లో ఎన్నికలు జరిగే చాన్స్

 పాకిస్తాన్ పార్లమెంట్ రద్దు..4 నెలల్లో ఎన్నికలు జరిగే చాన్స్
  • ప్రధాని సూచనతో రద్దు చేసినట్లు ప్రకటించిన రాష్ట్రపతి భవన్
  • 4 నెలల్లో ఎన్నికలు జరిగే చాన్స్


ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంట్ అధికారికంగా రద్దయింది. ప్రస్తుతం ప్రభుత్వానికి పదవీకాలం ఇంకో మూడ్రోజులు మిగిలి ఉండగానే ప్రధాని షెహబాజ్ షరీఫ్ సూచనతో ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ గురువారం జాతీయ అసెంబ్లీని రద్దుచేశారు. పాలనా వ్యవహారాల కోసం ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ప్రస్తుత ప్రధాని, అపొజిషన్​ లీడర్ రాజా రియాజ్​లు తాత్కాలిక ప్రధాని పేరును సూచించేందుకు మూడ్రోజుల గడువుంది. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 
రాజ్యాంగం ప్రకారం ప్రధాని సిఫార్సు చేసిన 48 గంటల్లో రాష్ట్రపతి రద్దు చేయకపోతే, నేషనల్ అసెంబ్లీ దానికదే రద్దవుతుంది. ఇప్పటివరకు కొనసాగిన 15వ నేషనల్ అసెంబ్లీ 2018 ఆగస్ట్ 13న ఎన్నికైంది. 

వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు?
నిబంధనల ప్రకారం వచ్చే 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వెసులుబాటు ఉన్నప్పటికీ, అవి మరింత ఆలస్యం కానున్నాయి. ఇటీవలే దేశంలో జనాభా లెక్కింపు పూర్తయింది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని అక్కడి చట్టాలు చెప్తున్నాయి. కాబట్టి, అందుకు అదనంగా ఇంకో నెల రోజులు పట్టే అవకాశముంది. ఈ లెక్కన ఎన్నికలు నిర్వహించేందుకు కనీసం 120 రోజుల టైం పట్టొచ్చని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు.