
- అదొక స్ట్రాటజిక్ విధానమన్న ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ డీజీ ఔరంగజేబ్
న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో తమకేం సంబంధం లేదంటూ ఇంతకాలం చెప్పుకొచ్చిన పాకిస్తాన్.. తాజాగా నిజం ఒప్పుకుంది. అది తమ వ్యూహాత్మక చర్య అని మీడియా ఎదుట ఒప్పుకుంది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఔరంగజేబ్ అహ్మద్ చెప్పారు.“మా నేల, ఆకాశం, నీళ్లకు ముప్పు కలుగుతుందంటే మేం చూస్తూ ఊరుకోం.. ఈ విషయంలో రాజీ పడబోం.. ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు పుల్వామాలో వ్యూహాత్మక చర్య ద్వారా ప్రయత్నించాం.
మా సైన్యంపై దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని ప్రూవ్ చేస్కున్నం. ఇప్పుడుకూడా మరోసారి మా వ్యూహాత్మక నైపుణ్యాలను చూపించినం” అని ఔరంగజేబ్ విదేశీ విలేకరులతో కూడిన మీడియా సమావేశంలో అన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పరిణామాలపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీప్ చౌదరి, నౌకాదళ అధికారి కూడా ఉన్నారు.
గతంలో బుకాయింపులు
పుల్వామా దాడి జరిగినప్పటి నుంచి.. ఇందులో పాకిస్తాన్ తన ప్రమేయం లేదని వాదిస్తూవచ్చింది. దాడి చేసింది తామేనంటూ జైషే ప్రకటించుకుంది. ఈ దాడి పాల్పడింది జైషే టెర్రరిస్టులే అయినా పాక్ ప్రభుత్వం వారికి అండగా ఉందని భారత్ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి భారత్ ఎన్నోసార్లు ఎవిడెన్సులు బయటపెట్టింది.
అయితే, వాటన్నింటినీ తోసిపుచ్చిన పాక్.. ఆ ఘటనతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధంలేదని బుకాయిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ డైరెక్టర్ జనరల్ స్వయంగా ప్రకటించడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నట్లయింది. ఆ దేశ రెండునాల్కల ధోరణి మరోసారి బయటపడింది.
12 రోజుల్లో ప్రతీకారం తీర్చుకున్నం..
2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళ్తున్న కాన్వాయ్‌పై టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన 12 రోజులకు 2019 ఫిబ్రవరి 26న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. ఎల్‌వోసీని దాటి పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలను పేల్చివేసింది. జైషే మహ్మద్ శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసి ప్రతీకారం తీర్చుకుంది.