
యుద్ధం.. మన ఆసియాలో మరో యుద్ధం ప్రారంభం కాబోతుందా.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం రాబోతుందా.. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్గా ఆ దేశ రాజధాని కాబూల్ పై పాకిస్తాన్ బాంబులతో విరుచుకుపడుతుంది. పాక్, ఆఫ్ఘన్ దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇప్పటికే కాబూల్ సిటీని టార్గెట్ చేస్తూ.. పాకిస్తాన్ చేసిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. పాక్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. ప్రతిదాడులకు సిద్ధం అంటోంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం రాబోతుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య గొడవలకు కారణం ఏంటి..:
TTP.. తెహరికి తాలిబనర్ పాకిస్తాన్. ఇది ఉగ్రవాద సంస్థ. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు మద్దతు ఇస్తున్నారు. ఈ TTP సంస్థ.. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ లో దాడులకు తెగబడుతుంది. రైళ్లు పేల్చివేయటం.. బాంబులు పేల్చటం వంటివి చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా.. తాలిబన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నా.. ఆఫ్ఘన్ తాలిబన్ల డోంట్ కేర్ అన్నట్లు ఉన్నారు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు.. ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ టార్గెట్ గా విమానదాడులకు తెగబడింది.
మరో కీలక అంశం. పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీయులను తిరిగి వాళ్ల దేశం పంపిస్తుంది పాకిస్తాన్. తాలిబన్లపై ఒత్తిడి తీసుకురావటానికి శరణార్థులను ఉపయోగిస్తుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆర్థికంగా చితికిపోయింది. తాలిబన్ల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించటం ద్వారా.. తాలిబన్లపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఇది కూడా తాలిబన్లకు తలనొప్పిగా మారింది.
మరో అంశం డ్యూరాండ్ లైన్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య 2 వేల 600 కిలోమీటర్లు సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోకి ప్రవేశించి పాకిస్తానీయులను చంపుతున్నారనేది పాక్ వాదన. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య తరచూ కాల్పులు, గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి.
ఇన్నాళ్లు తాలిబన్ల విషయంలో ఆచితూచి స్పందించిన పాకిస్తాన్.. ఇప్పుడు టీటీపీ టార్గెట్ గా ఆఫ్గనిస్తాన్ దేశంపై వైమానిక దాడులకు దిగింది. టీటీపీ చీఫ్ ను చంపినట్లు కూడా ప్రకటించింది పాక్. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్, ఆఫ్గన్ దేశాల మధ్య పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ రెండు దేశాల్లోని బాధితులు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ భద్రతకు ముప్పుగా భావిస్తుంది భారత్..
మొత్తానికి పాక్, ఆఫ్గనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఆఫ్ఘన్, పాక్ రెండు దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఒక వేళ పూర్తి స్థాయి యుద్ధం చేసినా.. అది మూడు, నాలుగు రోజుల్లోనే క్లోజ్ కావొచ్చు.