న్యూజిలాండ్​పై పగ తీర్చుకున్న పాక్

న్యూజిలాండ్​పై పగ తీర్చుకున్న పాక్
  • రవూఫ్‌.. రఫ్ఫాడించాడు
  • న్యూజిలాండ్‌‌పై  పాకిస్తాన్‌‌ గెలుపు
  • చెలరేగిన రిజ్వాన్‌‌, ఆసిఫ్‌‌ అలీ
  • బౌలింగ్‌‌లో కివీస్‌‌ విఫలం

షార్జా: ఇండియాపై హిస్టారికల్​ విక్టరీ సాధించిన పాకిస్తాన్​.. న్యూజిలాండ్​పై పగ తీర్చుకుంది. టీ20 వరల్డ్​కప్​నకు ముందు భద్రతా కారణాలతో తమ దేశ టూర్​ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన కివీస్​ను దెబ్బకు దెబ్బతీసి మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్​ బౌలింగ్​లో అదరగొట్టిన పాక్​.. మంగళవారం జరిగిన సూపర్‌‌–12, గ్రూప్‌‌–2 మ్యాచ్‌‌లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా న్యూజిలాండ్‌‌ 20 ఓవర్లలో 134/8 స్కోరు చేసింది. డారెల్‌‌ మిచెల్‌‌ (27), డేవన్‌‌ కాన్వే (27) టాప్‌‌ స్కోరర్లు. పాక్​ పేసర్‌‌ హారిస్‌‌ రవూఫ్‌‌ (4/22) కివీస్‌‌ ఇన్నింగ్స్‌‌ను కుదేల్‌‌ చేశాడు. తర్వాత పాక్‌‌ 18.4 ఓవర్లలో 135/5 స్కోరు చేసి నెగ్గింది. రిజ్వాన్‌‌ (33) తో పాటు చివర్లో ఆసిఫ్‌‌ అలీ (12 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్సర్లతో 27 నాటౌట్‌‌) ధనాధన్​ ఇన్నింగ్స్‌‌ ఆడాడు. రవూఫ్​ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచాడు.
రవూఫ్​ సూపర్‌‌ బౌలింగ్‌‌..
టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన కివీస్‌‌ను.. పాక్‌‌ పేసర్‌‌ హారిస్‌‌ రవూఫ్‌‌ బాగా కట్టడి చేశాడు. మిగతా బౌలర్లూ సత్తా చాటారు. ఓపెనర్లు గప్టిల్‌‌ (17), డారెల్‌‌ మిచెల్‌‌ ఫస్ట్‌‌ వికెట్‌‌కు నెలకొల్పిన 36 రన్సే హయ్యెస్ట్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌. స్టార్టింగ్‌‌ నుంచి అద్భుతమైన స్వింగ్‌‌ రాబట్టిన షాహీన్‌‌ ఆఫ్రిది (1/21).. ఫస్ట్‌‌ ఓవర్‌‌ మెయిడెన్‌‌ వేశాడు. అయితే మిచెల్​తో కలిసి గప్టిల్​ ధాటిగానే ఆడాడు. కానీ రవూఫ్‌‌ బౌలింగ్‌‌కు రావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆరో ఓవర్‌‌లో గప్టిల్‌‌ను ఔట్‌‌ చేయడంతో పవర్‌‌ప్లేలో కివీస్​ 42/1 స్కోరుతో నిలిచింది అయితే. ఓ ఎండ్‌‌లో కేన్​ విలియమ్సన్‌‌ (25) నిలకడగా ఆడినా.. ఇమాద్‌‌ బౌలింగ్​లో మిచెల్​, హఫీజ్​ బౌలింగ్​లో  నీషమ్‌‌ (1)  ఔటవడంతో  పది ఓవర్లకు 60/3తో కష్టాల్లో పడింది. ఈ టైమ్​లో కేన్​కు​ కాన్వే తోడయ్యాడు. హఫీజ్‌‌ బౌలింగ్‌‌లో కేన్‌‌ 6,4 కొడితే, కాన్వే.. షాదాబ్‌‌కు హ్యాట్రిక్​ ఫోర్లతో స్వాగతం పలికాడు. దీంతో 12, 13 ఓవర్లలో 25 రన్స్‌‌ వచ్చాయి. అయితే 14వ ఓవర్‌‌లో విలియమ్సన్‌‌ అనూహ్యంగా రనౌట్‌‌ కావడంతో కివీస్‌‌ ఇన్నింగ్స్‌‌ మలుపు తిరిగింది. 18వ ఓవర్‌‌లో మూడు బాల్స్‌‌ తేడాలో కాన్వే, ఫిలిప్స్‌‌ (13)ను రవూఫ్‌‌ ఔట్‌‌ చేశాడు. సీఫర్ట్‌‌ (8), శాంట్నర్​ (6) కూడా విఫలమయ్యారు. లాస్ట్‌‌ నాలుగు ఓవర్లలో ఒక్క ఫోరే రావడంతో కివీస్‌‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. 
ఆసిఫ్‌‌.. అదరహో
చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్​లో పాక్‌‌ టాప్‌‌ ఆర్డర్‌‌ నిరాశపర్చినా.. ఓపెనర్‌‌ రిజ్వాన్ మంచి ఇన్నింగ్స్‌‌ ఆడాడు. బౌల్ట్‌‌, సౌథీ బౌలింగ్‌‌లో రెండు ఫోర్లతో టచ్‌‌లోకి వచ్చాడు. అయితే ఇండియాపై చెలరేగిన కెప్టెన్‌‌ బాబర్‌‌ ఆజమ్‌‌ (9) ఆరో ఓవర్‌‌లో ఔటయ్యాడు. పవర్​ప్లే తర్వాత రిజ్వాన్‌‌, ఫకర్‌‌ జమాన్‌‌ (11) సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో  ముందుకెళ్లారు. 9వ ఓవర్‌‌లో ఫకర్‌‌ ఔటైనా.. హఫీజ్‌‌ (11) భారీ సిక్సర్‌‌తో ఖాతా తెరిచాడు. పది ఓవర్లలో  58/2 స్కోరు చేసిన పాక్‌‌..  తర్వాతి రెండు ఓవర్లలో హఫీజ్‌‌, రిజ్వాన్‌‌ వికెట్లు కోల్పోయి డీలా పడింది.  ఈ దశలో షోయబ్‌‌ మాలిక్‌‌ (26 నాటౌట్‌‌) కీలక ఇన్నింగ్స్‌‌ ఆడాడు. ఇమాద్‌‌ వసీమ్‌‌ (11)తో ఐదో వికెట్‌‌కు 18 రన్స్‌‌ జోడించాడు. ఇక 30 బాల్స్‌‌లో 44 రన్స్‌‌ చేయాల్సిన దశలో ఆసిఫ్‌‌ అలీ ఒక్కసారిగా చెలరేగాడు. 17వ ఓవర్లో 2 సిక్సర్లతో 17 రన్స్‌‌ రాబట్టి మ్యాచ్​ను మలుపు తిప్పాడు. ఆ వెంటనే  మాలిక్‌‌ 4, 6 కొట్టాడు. తర్వాతి ఓవర్లో  సిక్స్‌‌తో ఆసిఫ్​ మ్యాచ్​ను​ ఫినిష్​ చేశాడు.