భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు రావాల్సిందే..ఐసీసీపై పాక్ క్రికెట్ బోర్డు సీరియస్

భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు రావాల్సిందే..ఐసీసీపై పాక్ క్రికెట్ బోర్డు సీరియస్

2025 లో ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ పాక్ లో నిర్వహించాల్సి ఉంది. అయితే భారత క్రికెట్ జట్టును పాక్ పంపేది లేదని బీసీసీఐ ఖరాఖండీగా చెప్పేసింది. ఇటీవలే జరిగిన ఆసియా కప్ 2023 పాక్ లో నిర్వహించాల్సి ఉండగా.. టీమిండియా పాక్ లో ఆడేందుకు నిరాకరించడంతో ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరిగింది. దీని ప్రకారం మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ ను యధావిధిగా నిర్వహించగా.. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ శ్రీలంకలో జరిపారు. సరిగ్గా ఇదే సమస్య పాక్ కు మరోసారి వచ్చి చేరింది. 

నివేదికల ప్రకారం..2025 ఫిబ్రవరి-మార్చి నెలలో పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడంపై  పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీతో మాట్లాడింది. పీసీబీ ఛైర్మన్ జకా అష్రఫ్, సిఓఓ సల్మాన్ నసీర్ అహ్మదాబాద్‌లోని ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ పాక్ కు వస్తుందో రాదో అనే విషయంపై కీలక విషయాలను మాట్లాడింది. ఎలాంటి పరిస్థితిలోనైనా ఐసీసీ  టోర్నమెంట్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని..భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తే, గ్లోబల్ బాడీ స్వతంత్ర భద్రతా ఏజెన్సీని నియమించాలని పీసీబీ అధికారులు ఐసీసీకి సూచించారు.  
 
గత రెండేళ్లలో ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు లేకుండానే అనేక అగ్రశ్రేణి జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాయని పీసీబీ అధికారులు తెలిపారు. ఒకవేళ భారత్ తన జట్టును పంపకుండా, మ్యాచ్‌లను వేరే దేశానికి తరలించిన పక్షంలో ఐసీసీ పాకిస్థాన్‌కు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్టు సమాచారం.పాకిస్తాన్, భారత ప్రభుత్వాల మధ్య భద్రతా కారణాల దృష్ట్యా భారత్ మళ్లీ పాక్ లో ఆడేందుకు నిరాకరించే అవకాశం ఎక్కువగా ఉందని పీసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.

2008 లో పాకిస్థాన్ లో చివరిసారిగా పర్యటించిన భారత్.. ఇప్పటివరకు భద్రత కారణాల దృష్ట్యా ఆ దేశానికి వెళ్ళలేదు. 2012 లో భారత్ వేదికగా టీమిండియా పాక్ తో చివరిసారిగా మూడు వన్డేల సిరీస్ తర్వాత దాయాధి జట్ల మధ్య పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి.