
- పాక్‌లో వరద బీభత్సం
- 937 మంది మృతి
- నిరాశ్రయులైన 3 కోట్ల మంది
- దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటన
ఇస్లామాబాద్: భారీ వర్షాలు, వరదలకు పాకిస్తాన్ అతలాకుతలమవుతోంది. వరద బీభత్సానికి 343 మంది చిన్నారులు సహా 937 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాక్ సర్కార్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. జూన్ 14 నుంచి గురువారం వరకు వానల ప్రభావంతో దాదాపు 3 కోట్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్‌ఎండీఏ) తెలిపింది. సింధ్ ప్రావిన్స్‌లో నష్టం భారీగా ఉందని.. అక్కడ 306 మంది మృతిచెందారని.. బలూచిస్తాన్‌లో 234, ఖైబర్ పంక్తూన్ఖ్వాలో 185, పంజాబ్ ప్రావిన్స్‌లో 165, పీవోకేలో 37, గిల్గిట్–బాల్టిస్తాన్‌లో 9 మరణాలు నమోదైనట్లు పేర్కొంది.
పాక్‌లో ఆగస్టు నెల సగటు వర్షపాతం 48 మీ.మీ. కాగా ఎప్పుడూ లేని విధంగా ఈసారి 166.8 మి.మీ వర్షం కురిసిందని వెల్లడించింది. అయితే సింధ్ ప్రావిన్స్‌లో 784%, బలూచిస్తాన్‌లో 496% అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఈ అసాధారణ వర్షాలకు దక్షిణ పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్నది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంత్రులు, అధికారులతో సమావేశమై ‘వార్ రూమ్’ ఏర్పాటు చేశారని వాతావరణ మార్పుల శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ తెలిపారు.