ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‌కు మరో దెబ్బ.. కొరడా ఝులిపించిన ఐసీసీ

ఓటమి బాధలో ఉన్న  పాకిస్థాన్‌కు మరో దెబ్బ.. కొరడా ఝులిపించిన ఐసీసీ

ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. సొంతగడ్డపై కంగారూ జట్టును ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాక్ క్రికెటర్లు.. తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఏకంగా 360 పరుగులతో భారీ తేడాతో ఓటమి పాలై..  మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తేడాతో వెనుకబడ్డారు. ఈ ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌  కారణంగా పాక్ ఆటగాళ్లపై ఐసీసీ కొరడా ఝులిపించింది. 

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్ జట్టు నిర్ణీత సమయం కన్నా 2 ఓవర్లు తక్కువగా వేసినట్లు గుర్తించిన మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నారు. ఆర్టికల్ 2.22 ప్రకారం.. ప్రతి ఓవర్‌కు ఐదు శాతం చొప్పున పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. అదనంగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్స్‌లో రెండు పాయింట్లు కోత విధించారు. ఫలితంగా పాకిస్థాన్ రెండో స్థానానికి పడిపోగా.. భారత జట్టు అగ్రస్థానానికి దూసుకొచ్చింది. అలాగే, పాకిస్థాన్ విన్నింగ్ పర్సంటేజ్ 66.67 నుంచి 61.11కు పడిపోయింది.

ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. ఓవర్‌కు ఒక్కో పాయింట్‌ చొప్పున కోత విధిస్తారు. స్లో ఓవర్ రేట్ అభియోగాలను ఫీల్డ్ అంపైర్లు జోయెల్ విల్సన్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌.. థర్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్, ఫోర్త్ అంపైర్ డోనోవన్ కోచ్, పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ అంగీకరించారు. 

89 పరుగులకే ఆలౌట్

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 487 పరుగుల భారీ స్కోర్ చేయగా.. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం 216 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 233/ 5 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆపై 450 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన పాక్ 89 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మొదలుకానుంది. మెల్‌బోర్న్ వేదికగా ఈ  మ్యాచ్ జరగనుంది.