
శాంతి జపాలు చేస్తున్నది ప్రపంచం మెప్పుకోసమే తప్ప తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏ మాత్రం మారలేదని పాకిస్థాన్ మరోసారి నిరూపించుకుంది. తాను పెంచిపోషిస్తున్న టెర్రరిస్టుల్ని కాపాడుకునే తాపత్రయంలో అడ్డంగా దొరికిపోయింది. 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలైపోయిన పుల్వామా టెర్రర్ అటాక్ తో జైషే మహ్మద్ సంస్థకు అసలు సంబంధమేలేదని ప్రకటించింది. ఇండియా గనుక ఎవిడెన్స్ ఇస్తే ఎంక్వైరీ చేస్తామన్న దాయాది దేశం అంతలోనే మాటమార్చి జైషేకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. పుల్వామా ఘటనకు ముందు సూసైడ్ బాంబర్ ఆదిల్ వీడియోలో మాట్లాడిన మాటలుగానీ, దాడికి పాల్పడింది తామేనంటూ జైషే ప్రతినిధి చేసిన ప్రకటనగానీ నిజాలుకావని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చెప్పారు. శుక్రవారం బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఆయన, పుల్వామా దాడికి సూత్రధారి పాకిస్థానేనన్న ఇండియా ఆరోపణల్ని నిజం చేశారు.
అ ప్రకటన వాళ్లది కాదు!
పుల్వామా దాడి తర్వాత ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో పాక్ ను హెచ్చరించిన దరిమిలా దాయాది దేశం నష్టనివారణ చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ శుక్ర, శనివారాల్లో పలు అంతర్జాతీయ మీడియా సంస్థల ముందు తమ వాదనలు వినిపించారు. జైషే చీఫ్ మసూద్ అజర్ ఇప్పటికీ పాకిస్థాన్ లోనే ఉన్నాడని ఒప్పుకున్న ఖురేషీ, బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో అడుగుముందుకేసి అసలు పుల్వామా దాడితో జైషేకు సంబంధమే లేదని ప్రకటించారు. పాక్ మంత్రి స్టేట్ మెంట్ తో బిత్తరపోయిన సదరు మీడియా ప్రతినిధి , ‘అదేంటి సార్ , మేమే చేశామని జైషేనే ఒప్పుకుందిగా?’అని ప్రశ్నించారు. దీంతో మంత్రి ఖురేషీ మరింత లోతైన వివరణ ఇచ్చారు.
జైషే ఓ ధార్మిక సంస్థ
‘‘జైషే సంస్థను పాక్ ప్రభుత్వం నిషేధించిన మాట నిజమే. అయితే సంస్థ కీలక నాయకులు ఇప్పటికీ మాతో టచ్ లో ఉన్నారు . పుల్వామా దాడిని క్లెయిమ్ చేసుకుంటూ తాము ఎలాంటి ప్రకటన చేయలేదని జైషే లీడర్లు నాతో చెప్పారు. క్లెయిమ్ చేసుకున్నట్లు బయటికొచ్చిన ఆడియోగానీ, ఇతరత్రా వీడియోలుగానీ ఒరిజనల్ కాకపోవచ్చు. నిజానికి జైషే ఒక ధార్మిక సంస్థ. వాళ్లు మదర్సాలు నడుపుకుంటుంటే, వాటిని టెర్రరిస్టు క్యాంపులంటూ ఇండియా ప్రాపగండా చేస్తున్నది. మొన్న బాలాకోట్ పై దురాక్రమణనే తీసుకోండి , పాక్ గగనతలంలో 20 నిమిషాలకు పైగా ఇండియన్ విమానాలు తిరిగాయంటే ఎవరైనా నమ్ము తారా? సరే, వాళ్లు(ఇండియా) చెబుతున్నట్లు బాంబులు వేశారనే అనుకుందాం, మరి 350 మంది డెడ్ బాడీలు ఏమైనట్లు? పాకిస్థాన్ ఒక శాంతికాముక దేశం. ఇరుగుపొరుగుతో స్నేహపూర్వక సంబంధాలే కోరుతుందితప్ప ఘర్షణ కాదు. ఇండియన్ గవర్నమెంట్, అక్కడి మీడియా అనవసరంగా మాపై బురదజల్లుతున్నది. పుల్వామా దాడికి సంబంధించి ఇండియా రెండ్రోజుల కిందటే సాక్ష్యాధారాలిచ్చింది. అవి పాక్ కోర్టుల్లో నిరూపించదగినవైతేనే ముందుకు వెళతాం” అని ఖురేషీ వివరించారు.
మాపై ఒత్తిళ్లు లేవు
ఐఏఎఫ్ పైలట్ అభినందన్ వర్తమాన్ విడుదల వెనుక పాక్ పై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఖురేషీ చెప్పారు. పొరుగుదేశాన్ని బాధపెట్టడం ఇష్టంలేకే విడుదల చేశామన్నారు . కానీ ఇండియా మాత్రం ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నదని, ఒకవేళ పాక్ కూడా రాజకీయాలు మొదలుపెడితే, పార్లమెంట్, పఠాన్ కోట్, ఉరీలో దాడులు ఎలా జరిగాయో చర్చించాల్సి వస్తుందని ఖురేషీ వ్యాఖ్యానించారు.