
- డిబేట్‌లో భారత ప్రతినిధి చురకలు
న్యూఢిల్లీ: యూఎన్ వేదికగా మరోసారి వక్రబుద్ధి చూపించిన పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బదులిచ్చింది. సెక్యూరిటీ కౌన్సిల్‌లో మహిళలు, శాంతిభద్రతలపై బహిరంగ చర్చ జరగ్గా.. భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన పాక్‌కు యూఎన్‌లో శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ధీటైన సమాధానమిచ్చారు.
పాక్ ప్రతినిధి సౌమా సలీమ్ మాట్లాడుతూ.. కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసకు గురయ్యారంటూ ఆరోపణ చేశారు. దీనికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఆన్సర్ ఇచ్చారు. తమను ఒకమాట అనే ముందు తమ సొంత దేశం ఏం చేసిందో గుర్తుంచుకుంటే మంచిదని పాక్ ప్రతినిధికి చురకలంటించారు.
భారత్‌లో మహిళలు, శాంతి భద్రతలకు సంబంధించిన మార్గదర్శకాలు సరిగ్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ ఏటా భారత్‌కు వ్యతిరేకంగా, ముఖ్యంగా దేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుదారి పట్టించే ప్రసంగాలను వినాల్సి వస్తున్నదని అసహనం వ్యక్తంచేశారు.
1971 ఆపరేషన్ సెర్చ్‌లైట్ ప్రస్తావన..
1971లో ఆపరేషన్ సెర్చ్‌లైట్ సందర్భంగా 4 లక్షల మంది పాక్ మహిళలపై జరిగిన సామూహిక లైంగిక దాడి గురించి హరీశ్ ప్రస్తావించారు. పాకిస్తాన్ చేసే ప్రొపగాండాను నమ్ముతూ.. ప్రపంచం ఈ విషయాలన్నీ చూస్తూ ఉండిపోయిందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ తన సొంత దేశంపైనే బాంబులు వేస్తూ మారణహోమానికి పాల్పడుతోందని ఆరోపించారు. మహిళలను టార్చర్ చేయడంలో ఆ దేశానికి
దారుణమైన రికార్డులున్నాయని విమర్శించారు.