పాకిస్తాన్: చర్చీలపై ఆందోళనకారులు దాడులు.. పరిస్థితి ఉద్రిక్తం

పాకిస్తాన్: చర్చీలపై ఆందోళనకారులు దాడులు.. పరిస్థితి ఉద్రిక్తం

పాకిస్థాన్, ఫైసలాబాద్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. క్రిస్టియన్ మైనారిటీలపై ఓ వర్గానికి చెందిన ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. చర్చీలను ధ్వంసం చేస్తూ.. మైనారిటీల అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారు.

పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ జిల్లాలోని జరన్‌వాలా రోడ్డు సమీపంలోని చర్చిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అనంతరం చర్చి  పరిసర ప్రాంతాల్లోని క్రైస్తవుల ఇళ్లను కూడా ధ్వంసం చేసి, తగలబెట్టారు. ఒక క్రైస్తవ వ్యక్తి దైవదూషణకు పాల్పడ్డారని ఆరోపణలు రావడమే ఈ ఆగ్రహజ్వాలలకు కారణమని తెలుస్తోంది. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దైవదూషణ ఆరోపణలు

నివేదికల ప్రకారం.. ఫైసలాబాద్‌లో క్రైస్తవ మైనారిటీ కుటుంబం పవిత్ర ఖురాన్‌ను ఉల్లంఘించిందని ఆరోపించిన తర్వాత ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వందలాది మంది అందోళనకారులు ఒక్కచోట చేరి చర్చిలపై దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.