అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు తిరస్కరించిన పాక్ స్పీకర్

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు తిరస్కరించిన పాక్ స్పీకర్

పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతోంది. నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు స్పీకర్ అసద్ తిరస్కరించారు. సుప్రీం కోర్టు ఏ శిక్ష విధించినా సిద్ధమేనని స్పీకర్ ప్రకటించారు. మరో వైపు సుప్రీం కోర్టు లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఉత్తర్వులను పున:పరిశీలించాలని కోరింది. ఇటు కేబినెట్ మంత్రులతో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఇమ్రాన్ ఖాన్.. కాసేపట్లో మంత్రులతో సమావేశం కానున్నారు. ఇవాళే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరపాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను స్పీకర్ పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అవిశ్వాస ఘట్టం నుంచి బయటపడేందుకు ఇమ్రాన్ ఖాన్ అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చించిన ప్రధాని.. చివరకు సుప్రీం కోర్టు తలుపుతట్టారు. 

పాక్  జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 సభ్యులున్నారు. అవిశ్వాసంపై ప్రతిపక్షాలు నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం జాతీయ అసెంబ్లీలో అధికార పార్టీ బలం 164గా ఉండగా.. విపక్షాల సంఖ్యా బలం 177గా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్  అవిశ్వాసం నుంచి గట్టెక్కే అవకాశాలు కన్పించడం లేదు. దీంతో అసెంబ్లీని రద్దు చేస్తేనే మళ్లీ ఎన్నికలకెళ్లొచ్చనే భావనలో ఇమ్రాన్ ఉన్నారు. ఇదే అస్త్రాన్ని తొలుత ప్రయోగించినా..సుప్రీం కోర్టు తీర్పుతో బెడిసికొట్టింది.