
- కుల్‌భూషణ్‌ను కలిసేందుకు అనుమతి
- ఐసీజే తీర్పుకు అనుగుణంగా ముందుకెళ్తామన్న విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ:
నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ ఎట్టకేలకు దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు జాదవ్ న్యాయసహాయం పొందేందుకు వీలుగా కాన్సులర్ యాక్సెస్(దౌత్యాధికారులను సంప్రదించే హక్కును) కల్పిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు జాదవ్‌ను కలవడానికి రావాలంటూ ఇండియాకు ప్రపోజల్ పంపింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహ్మద్ ఫైజల్ ఈ మేరకు చేసిన ప్రకటనపై మన విదేశాంగ శాఖ ఆచితూచి స్పందించింది. పాక్ ప్రపోజల్ అందిందని, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ఐసీజే) తీర్పు నేపథ్యంలో దీన్ని(ప్రపోజల్‌ను) క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే తగిన రీతిలో స్పందిస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. కాగా, జాదవ్‌ను శుక్రవారమే కలవాలంటూ పాక్ డెడ్‌లైన్ విధించడం చర్చనీయాంశమైంది. ‘‘ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్తామనే విధివిధానాల్ని అందరితో చర్చించలేం. ఐసీజే తీర్పుకు అనుగుణంగా పరిస్థితుల్ని అంచనా వేస్తూ, డిప్లొమాటిక్ మార్గాల్లోనే ఆ దేశంతో కమ్యూనికేషన్ కొనసాగిస్తాం”అని రవీశ్ తెలిపారు. జాదవ్‌కు పాక్ ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షను నిలిపేస్తూ, ఆ తీర్పును రివ్యూ చేయాలని, ఆయనకు న్యాయసహాయం అందించాలని ఐసీజే జులై 17న సంచలన తీర్పు చెప్పింది. ఐసీజే ఆదేశాలు పాటించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో పాక్ తాజా ప్రతిపాదన చేసింది.
ఇదీ కేసు..
నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ ఆర్మీ కోర్టు విధించిన ఉరిశిక్షను నిలిపేయడంతోపాటు పాక్ తన తీర్పును రివ్యూ చేసి తీరాల్సిందేనని, నిందితుడు న్యాయసహాయం పొందేందుకు అనుమతించాలని ఐసీజే స్పష్టం చేసింది. 2016లో పాక్ ఆర్మీకి చిక్కిన కుల్‌భూషణ్‌పై గూఢచర్యం, టెర్రరిజం కేసులు పెట్టారు. ఏకపక్షంగా సాగిన విచారణలో ఆర్మీ కోర్టు అతనికి 2017 ఏప్రిల్‌లో ఉరిశిక్ష విధించింది. దీనిపై అభ్యంతరం తెలిపిన ఇండియా.. అదే ఏడాది మేలో ఐసీజేను ఆశ్రయించింది. ఇరాన్‌లో బిజినెస్ చేసుకుంటున్న జాదవ్‌ను పాక్ అక్రమంగా బంధించిందని, కనీసం లాయర్‌ను కూడా అనుమతించకుండా శిక్షలు ఖరారు చేశారని ఇండియా ఐసీజే దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసును రెండేండ్లకుపైగా విచారించిన ఇంటర్నేషనల్ కోర్టు గత నెల 17న తీర్పు చెప్పింది. లాయర్‌ను పెట్టుకునే హక్కు జాదవ్‌కు ఉందని, ఆ అవకాశం కల్పించకుండా పాక్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని జడ్జిలు ఆగ్రహించారు. జాదవ్‌ను తిరిగి ఇండియా తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తామని కేంద్రం ఇదివరకే ప్రకటించింది.
పాక్ రివర్స్ గేమ్
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ గత నాలుగు రోజులుగా కాశ్మీర్ సరిహద్దు వెంబడి పాక్ కాల్పులకు తెగబడుతోంది. జమ్మూకాశ్మీర్లోని కుప్వారా, రాజౌరీ జిల్లాల్లో పాక్ కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ప్రతిగా ఇండియా బలగాలు కూడా అంతే ధీటుగా జవాబిస్తున్నాయి. కాగా, ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్, రివర్స్లో ఇండియానే తప్పుచేసిందని, అందుకు వివరణ ఇవ్వాలంటూ ఇస్లామాబాద్లోని ఇండియా డిప్యూటీ హైకమిషనర్కు గురువారం సమన్లు జారీచేసింది.