పాక్‌‌లో ఆత్మాహుతి దాడి.. అర్ధరాత్రి పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌‌‌‌పై టెర్రరిస్టుల అటాక్ .. ఏడుగురు పోలీసులు మృతి

పాక్‌‌లో ఆత్మాహుతి దాడి.. అర్ధరాత్రి పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌‌‌‌పై టెర్రరిస్టుల అటాక్ .. ఏడుగురు పోలీసులు మృతి
  • ఆరుగురు టెర్రరిస్టులు హతం 

ఖైబర్ పఖ్తుంఖ్వా: పాకిస్తాన్‌‌‌‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌‌‌‌లోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌‌‌‌పై టెర్రరిస్టులు సూసైడ్ అటాక్ చేశారు. అనంతరం అందులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు చనిపోగా, ఆరుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. 

టెర్రరిస్టులు మొదట శుక్రవారం అర్ధరాత్రి పేలుడు పదార్థాలు ఉన్న ట్రక్కుతో డేరా ఇస్మాయిల్ ఖాన్‌‌‌‌ జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌‌‌‌ మెయిన్‌‌‌‌ గేటును ఢీకొట్టారు. దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. అనంతరం కొంతమంది టెర్రరిస్టులు పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌‌‌‌లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గ్రనేడ్లతో దాడి చేశారు. 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎదురు కాల్పులు జరిపారు. దాదాపు 5 గంటల పాటు ఏకధాటిగా ఎన్‌‌‌‌కౌంటర్ కొనసాగింది. మొత్తం ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టామని ఎస్పీ షాహిబ్జాదా సజ్జద్ అహ్మద్ శనివారం తెలిపారు. ఆత్మాహుతి దాడి బెల్టులు, పేలుడు పదార్థాలు, అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

‘‘దాడి జరిగినప్పుడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌‌‌‌లో 200 మంది ట్రైనీలు, ఇన్‌‌‌‌స్ట్రక్టర్స్, స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్లందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాం. ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌జీ కమాండోలు, అల్‌‌‌‌బర్క్ ఫోర్స్, ఎలైట్ ఫోర్స్, పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. మొదట ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టాం. మరో ముగ్గురు టెర్రరిస్టులు కాంపౌండ్‌‌‌‌లో దాక్కోగా, వాళ్లను కూడా వెతికి హతం చేశాం. దాదాపు 5 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది. 

ఈ క్రమంలో ఎదురుకాల్పుల్లో ఏడుగురు పోలీసులను కోల్పోయాం. మరో 13 మంది పోలీసులు గాయపడ్డారు. వాళ్లను ఆస్పత్రికి తరలించి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నాం” అని వెల్లడించారు. పోలీస్ ట్రైనింగ్ స్కూల్ ఏరియా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, కార్డన్‌‌‌‌సెర్చ్ కొనసాగుతున్నదని పేర్కొన్నారు.