రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోరాత్రంతా టెన్షన్

రాజస్థాన్  సరిహద్దు ప్రాంతాల్లోరాత్రంతా టెన్షన్
  • సీజ్​ఫైర్‌‌‌‌ ఉల్లంఘించి పాక్ కాల్పులు 
  • డ్రోన్లు ప్రయోగించడంతోపలుచోట్ల బ్లాకౌట్

జైపూర్: కాల్పుల విరమణకు ఒప్పుకొని కొన్ని గంటల్లోనే ఆ ఒప్పందానికి పాకిస్తాన్  తూట్లు పొడిచింది. శనివారం రాత్రి రాజస్థాన్  సరిహద్దుల ప్రాంతాల్లో యధేచ్చగా కాల్పులకు పాల్పడింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో డ్రోన్లు కూడా ప్రయోగించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందారు. సరిహద్దుల వెంట పేలుళ్ల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. జైసల్మేర్, బార్మర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో శత్రు దేశం డ్రోన్లు ప్రయోగించింది. 

దీంతో ఆ నగరాలు, ఏరియాల్లో రాత్రంతా విద్యుత్  సరఫరాను బంద్  చేశారు. అయితే, శత్రు దేశం డ్రోన్లను మన జవాన్లు నేలకూల్చారు. ఆదివారం బార్మర్ లోని కొన్ని ఏరియాల్లో డ్రోన్ల శకలాలు, మిసైల్  వంటి వస్తువులు ముక్కలు ముక్కలుగా పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. కాగా.. ఆదివారం ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంది. ప్రజలు ఎప్పట్లాగే తమ రోజువారీ కార్యకలాపాలను కొనసాగించారు. మార్కెట్లు, దుకాణాలను రీఓపెన్  చేశారు. అంతకుముందు రద్దుచేసిన పలు రైళ్లను వాయువ్య రైల్వే పునరుద్ధరించింది.