ఓటమి అంచు నుంచి తేరుకుని.. ఆసిస్ అద్భుతం!

ఓటమి అంచు నుంచి తేరుకుని.. ఆసిస్ అద్భుతం!
  • ఆసీస్‌ అద్భుతం
  • సెమీస్‌లో పాక్‌పై విజయం 
  • కంగారూలను గెలిపించిన వేడ్‌, స్టోయినిస్‌

దుబాయ్‌‌: ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని.. పాకిస్తాన్‌‌ మైండ్‌‌ బ్లాంక్‌‌ చేస్తూ టీ20 వరల్డ్‌‌కప్‌‌లో ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. గెలుపు ఖాయం అనుకున్న టైమ్‌‌లో పట్టు విడిచి.. వేడ్‌‌ ఇచ్చిన కీలక క్యాచ్‌‌ చేజార్చిన పాక్‌‌ ఇంటిదారి పట్టింది. అచ్చం న్యూజిలాండ్‌‌–ఇంగ్లండ్‌‌ సెమీస్‌‌ను తలపిస్తూ సాగిన పోరులో.. కివీస్‌‌  మాదిరిగానే ఆసీస్‌‌ మాయ చేసింది. 177 రన్స్‌‌ ఛేజింగ్‌‌లో 96/5 స్కోరుతో ఆశలు వదిలేసుకున్న ఆసీస్​ను మాథ్యూ వేడ్‌‌ (17 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 నాటౌట్‌‌), మార్కస్‌‌ స్టోయినిస్‌‌ (31 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్) అసాధారణ పోరాటంతో గట్టెక్కించారు. దాంతో, గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో కంగారూ టీమ్​ 5 వికెట్ల తేడాతో పాక్‌‌ను ఓడించింది. తొలుత  రిజ్వాన్‌‌ (52 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 67), ఫఖర్‌‌ జమాన్‌‌ (32 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 నాటౌట్‌‌) ఫిఫ్టీలతో చెలరేగడంతో పాక్‌‌ 20 ఓవర్లలో 176/4 స్కోరు చేసింది. స్టార్క్‌‌ (2/38) రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌‌లో వేడ్‌‌, స్టోయినిస్‌‌ జోరుతో ఆసీస్‌‌ 19 ఓవర్లోనే  ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌‌ను అందుకుంది. వార్నర్‌‌ (30 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 49) కూడా సత్తా చాటాడు. పాక్‌‌ స్పిన్నర్‌‌ షాదాబ్‌‌ ఖాన్‌‌ (4/26) నాలుగు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. వేడ్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌‌తో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోంది.  రెండు జట్లూ ఇప్పటిదాకా టీ20 కప్​ నెగ్గలేదు. దాంతో,  టోర్నీలో  కొత్త విజేత రానుంది.

షాదాబ్‌‌ మ్యాజిక్‌‌

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఆసీస్‌‌కు ఫస్ట్‌‌ ఓవర్లోనే షాక్‌‌ తగిలింది. పాక్‌‌ పేస్‌‌ సెన్సేషన్‌‌ షాహీన్‌‌ ఆఫ్రిది (1/35 ).. మూడో బాల్‌‌కే కెప్టెన్‌‌ ఆరోన్‌‌ ఫించ్‌‌ (0)ను గోల్డెన్‌‌ డకౌట్‌‌ చేశాడు. తర్వాతి బాల్‌‌కే మిచెల్‌‌ మార్ష్‌‌  (28) ఎల్బీ కోసం పాక్‌‌ రివ్యూ కోరింది. అంపైర్‌‌ కాల్‌‌లో నాటౌట్‌‌గా తేలిన మార్ష్‌‌.. వార్నర్‌‌కు సపోర్ట్‌‌ ఇచ్చాడు. షాహీన్‌‌ బౌలింగ్‌‌లో జాగ్రత్తగా ఆడిన వార్నర్‌‌..  ఇమాద్‌‌ వసీం (0/25) వేసిన నాలుగో ఓవర్లో 6, 4, 4తో ఒక్కసారిగా జోరు పెంచాడు. తర్వాత రవూఫ్‌‌  (0/35) బౌలింగ్‌‌లో మార్ష్‌‌ 6, 4 కొట్టగా.. పవర్‌‌ప్లేలో ఆసీస్‌‌ 52/1 స్కోరుతో నిలిచింది. కానీ, ఆరో ఓవర్లో బౌలింగ్‌‌కు వచ్చిన స్పిన్నర్‌‌ షాదాబ్‌‌ ఖాన్‌‌ మ్యాజిక్‌‌ చేశాడు. తన స్పెల్‌‌లో ఓవర్‌‌కో వికెట్‌‌ చొప్పున నాలుగు వికెట్లు తీసి ఆసీస్‌‌ను దెబ్బకొట్టాడు. మార్ష్‌‌, వార్నర్‌‌తో పాటు స్మిత్‌‌ (5), మ్యాక్స్‌‌వెల్‌‌ (7) అతని బుట్టలో పడ్డారు.

స్టోయినిస్‌‌, వేడ్‌‌ కమాల్‌‌

వరుస వికెట్లు పడటంతో ఆసీస్‌‌ ఒక్కసారిగా 96/5తో డిఫెన్స్‌‌లో పడింది. అయితే,  మార్కస్‌‌  స్టోయినిస్‌‌, మాథ్యూ వేడ్‌‌  క్రీజులో ఉండటంతో ఆ జట్టు ఆశలు కోల్పోలేదు. అంచనాలకు తగ్గట్టుగా ఆడిన మార్కస్‌‌ క్రమం తప్పకుండా బౌండ్రీలు రాబట్టాడు. మాథ్యూ వేడ్‌‌ స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ సపోర్ట్‌‌ ఇచ్చాడు. 24 బాల్స్‌‌లో 50 రన్స్‌‌ అవసరమైన టైమ్‌‌లో మార్కస్‌‌తో పాటు వేడ్‌‌ స్పీడు పెంచాడు. రెండు ఓవర్లలో చెరో సిక్స్‌‌, ఫోర్‌‌ బాది 30 రన్స్‌‌ రాబట్టడంతో  ఆసీస్‌‌ రేసులోకి వచ్చింది. దాంతో, విజయ సమీకరణం 12 బాల్స్‌‌లో 22 రన్స్‌‌గా మారింది. షాహీన్‌‌ వేసిన 19వ ఓవర్‌‌ మూడో బాల్‌‌కు  వేడ్‌‌ ఇచ్చిన టఫ్‌‌ క్యాచ్‌‌ను హసన్‌‌ అలీ వదిలేశాడు. దీనికి పాక్‌‌ మూల్యం చెల్లించుకుంది. తర్వాతి మూడు బాల్స్‌‌ను కళ్లు చెదిరే షాట్లతో సిక్సర్లుగా మలచిన వేడ్‌‌ మరో ఓవర్‌‌ మిగిలుండగానే ఆసీస్​కు విక్టరీ అందించాడు.

రిజ్వాన్‌‌, జమాన్‌‌ ధనాధన్‌‌ 

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పాక్‌‌కు ఓపెనర్లు రిజ్వాన్‌‌, బాబర్‌‌ ఆజమ్‌‌ (39) మంచి ఆరంభం ఇచ్చారు. తొలుత కాస్త జాగ్రత్తగా ఆడినా తర్వాత నెమ్మదిగా గేర్లు మార్చారు. హేజిల్‌‌వుడ్‌‌ (0/49)  వేసిన ఐదో ఓవర్లో రిజ్వాన్‌‌ స్ట్రయిట్‌‌ సిక్సర్‌‌తో జోరు పెంచగా..  పవర్‌‌ప్లేలో పాక్‌‌ 47/0 స్కోరు చేసింది.  ఫీల్డింగ్‌‌ మారిన తర్వాత స్పిన్నర్‌‌ జంపా (1/22) ఎంట్రీతో రన్స్‌‌ వేగం తగ్గింది. పొదుపుగా బౌలింగ్‌‌ చేసిన తను.. పదో ఓవర్లో బాబర్‌‌ను ఔట్‌‌ చేసి ఫస్ట్‌‌ వికెట్‌‌కు 71 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ చేశాడు. ఈ దశలో రిజ్వాన్‌‌కు ఫఖర్‌‌ జమాన్‌‌ తోడయ్యాడు. స్పిన్‌‌, పేస్‌‌ తేడాలేకుండా ఇద్దరూ భారీ షాట్లు కొట్టడంతో14వ ఓవర్లో స్కోరు వంద దాటింది. హేజిల్‌‌వుడ్‌‌ వేసిన 17వ ఓవర్లో జమాన్‌‌ సిక్స్‌‌ కొట్టగా.. రిజ్వాన్‌‌ 4, 6 బాదడంతో ఏకంగా 21 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి ఓవర్లో భారీ షాట్‌‌కు ట్రై చేసిన రిజ్వాన్‌‌ ఔటైనా.. జమాన్‌‌ 6, 4తో స్కోరు150 దాటించాడు. అయితే, 19వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌‌ చేసిన కమిన్స్‌‌.. ఫస్ట్‌‌ బాల్‌‌కే డేంజర్‌‌ మ్యాన్‌‌ ఆసిఫ్‌‌ అలీ (0)ని ఔట్‌‌ చేసి మూడు  రన్సే ఇచ్చాడు. లాస్ట్‌‌ ఓవర్లో తొలి మూడు బాల్స్‌‌కు రెండే రన్స్‌‌ ఇచ్చిన స్టార్క్‌‌.. షోయబ్‌‌ మాలిక్‌‌ (1)ను ఔట్‌‌ చేశాడు. కానీ, వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన జమాన్‌‌  ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు ఇన్నింగ్స్‌‌కు అదిరిపోయే ముగింపు ఇచ్చాడు.

సంక్షిప్త స్కోర్లు:

పాకిస్తాన్‌‌: 20  ఓవర్లలో 176/4  (రిజ్వాన్‌‌ 67, జమాన్‌‌ 55 నాటౌట్‌‌, స్టార్క్‌‌ 2/38).

ఆస్ట్రేలియా:  19 ఓవర్లలో 177/5 (వార్నర్‌‌ 49, వేడ్‌‌ 41 నాటౌట్‌‌, స్టోయినిస్‌‌ 40 నాటౌట్‌‌, షాదాబ్‌‌ 4/26)