కుశాల్‌‌ కేక.. ఆసియా కప్‌‌ ఫైనల్లో శ్రీలంక

కుశాల్‌‌ కేక..  ఆసియా కప్‌‌ ఫైనల్లో శ్రీలంక

ఫైనల్‌‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో శ్రీలంక జూలు విదిల్చింది. భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కుశాల్‌‌ మెండిస్‌‌ (87 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 91) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన సూపర్‌‌–4 లీగ్‌‌ మ్యాచ్‌‌లో లంక 2 వికెట్ల తేడాతో (డక్‌‌వర్త్‌‌ లూయిస్‌‌ పద్ధతి) పాకిస్తాన్‌‌ను చిత్తు చేసింది. రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌‌లో.. టాస్‌‌ గెలిచిన పాకిస్తాన్‌‌ 252/7 స్కోరు చేసింది. మహ్మద్‌‌ రిజ్వాన్‌‌ (73 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 86 నాటౌట్‌‌), అబ్దుల్లా షఫీక్‌‌ (52), ఇఫ్తికార్‌‌ అహ్మద్‌‌ (47) రాణించారు. 

స్టార్టింగ్‌‌లో లంక బౌలర్ల దెబ్బకు 9 రన్స్‌‌కే ఫకర్‌‌ జమాన్‌‌ (4) ఔటయ్యాడు. ఈ దశలో రిజ్వాన్‌‌ కీలక భాగస్వామ్యాలను నిర్మించాడు. కెప్టెన్‌‌ బాబర్‌‌ ఆజమ్‌‌ (29)తో రెండో వికెట్‌‌కు 64, షఫీక్‌‌తో మూడో వికెట్‌‌కు 27 రన్స్‌‌ జత చేసి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టాడు. ఈ ఇద్దరు ఔటైన తర్వాత మహ్మద్‌‌ హారిస్‌‌ (3), మహ్మద్‌‌ నవాజ్‌‌ (12) బ్యాట్లు ఝుళిపించకపోవడంతో పాక్‌‌ 130/5తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌లో రిజ్వాన్‌‌, ఇఫ్తికార్‌‌ ఆరో వికెట్‌‌కు 108 రన్స్‌‌ జత చేయడంతో పాక్‌‌ కోలుకుంది. చివర్లో షాదాబ్‌‌ (3) ఫెయిలయ్యాడు. లంక బౌలర్లలో పతిరణ 3, ప్రమోద్‌‌ మదుషన్‌‌ 2 వికెట్లు తీశారు. 

తర్వాత శ్రీలంక 42 ఓవర్లలో 252/8 స్కోరు చేసింది. ఓపెనర్లలో పాథుమ్‌‌ నిశాంక (29), కుశాల్‌‌ పెరీరా (17) నిరాశపర్చడంతో లంక 77 రన్స్‌‌కే 2 వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌‌లో పాక్‌‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కుశాల్‌‌.. సమరవిక్రమ (48)తో మూడో వికెట్‌‌కు 100 రన్స్‌‌ జత చేసి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టాడు. అయితే 30వ ఓవర్‌‌లో ఇఫ్తికార్‌‌ ఈ జోడీని విడదీసి పాక్‌‌ శిబిరంలో ఆశలు రేకెత్తించినా, తర్వాత వచ్చిన చరిత్‌‌ అసలంక (49 నాటౌట్‌‌) నిలకడగా ఆడాడు. అతనితో నాలుగో వికెట్‌‌కు 33 రన్స్‌‌ జోడించి కుశాల్‌‌ ఔటయ్యాడు. డాసున్‌‌ షనక (2) ఫెయిల్‌‌కాగా, ఒకే ఓవర్‌‌లో షాహిన్‌‌ (2/52) దెబ్బకు ధనంజయ్‌‌ డిసిల్వ (5), దునిత్‌‌ వెల్లాలగె (0) వెనుదిరిగినా అసలంక లంకను గెలిపించాడు.