
శ్రీనగర్:పాకిస్తాన్ మరోసారి బరితెగించింది.. జమ్మూకాశ్మీర్ లో సరిహద్దు వెంట డ్రోన్లతో చొరబడేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన భద్రతాబలగాలు వాటిపై కాల్పులు జరిపాయి. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్తాన్ కు చెందిన ఆరు డ్రోన్లు కనిపించడంతో భద్రతా ఆందోళనలు పెరిగాయి.
ఆదివారం రాత్రి 9:15 గంటల ప్రాంతంలో మెంధార్ సెక్టార్, బాలకోట్, లాంగోట్,గుర్సాయ్ నల్లా ప్రాంతాల మీదుగా డ్రోన్ కార్యకలాపాలను గుర్తించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. డ్రోన్లు చాలా ఎత్తులో ఎగురుతుండటంతో వాటిని అడ్డగించడం కష్టమైంది..డ్రోన్లు కొన్ని నిమిషాలు తిరుగుతూ పాకిస్తాన్ భూభాగానికి తిరిగి వెళ్లాయని అధికారులు చెప్పారు.
ఈ డ్రోన్లను నిఘా ప్రయోజనాల కోసం మోహరించారని..ఈ ప్రాంతంలో భారత సైనిక కదలికలపై నిఘా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.
సెర్చింగ్ ఆపరేషన్..
సరిహద్దుల్లోడ్రోన్లు కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. డ్రోన్లు ఎటువంటి ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను జారవిడిచలేదని నిర్దారించారు. మరోవైపు శత్రు వైమానిక దళాలు భారత గగనతలంలోకి రాకుండా నియంత్రించేందుకు గస్తీ ముమ్మరం చేశారు.
ఇటీవల కాలంలో పాకిస్తాన్ భారత్ భూభూగంలోకి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా సహా చట్ట విరుద్దమైన కార్యకలాపాలకు డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తోంది.
►ALSO READ | ఇది మాములు ఆటో కాదు, ఉబర్ ఆటో.. 1 కిమీకి రూ.425..! షాకైన ప్రయాణికుడు
ఇది సరిహద్దు వెంట ఉగ్రవాదం, చొరబాటును అడ్డుకోవడంలో భద్రతా దళాలకు సవాల్ గా మారింది. ఎల్ వోసీ వెంట డ్రోన్లు ఎగరడం మూడు రోజుల్లో రెండోసారి. అంతకుముందు జమ్మూలోని గజన్సూ ప్రాంతంలో డ్రోన్ తిరిగినట్టు స్థానికులు గుర్తించారు. అది కూడా కేవలం నిఘా కోసమే పంపినట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి.
డ్రోన్ స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతోంది అక్కడి ప్రభుత్వం. డ్రోన్ సమాచారం అందించిన వారికి రూ. 3లక్షల బహుమతిని అందిస్తామని ప్రకటించింది.
ఇటీవల కాలంలో సరిహద్దుల వెంటన డ్రోన్ల గస్తీ, నిఘా భద్రతా దళాలు ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేస్తోంది. నిరంతరం నిఘా అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.