సరిహద్దులు దాటిన కోహ్లీ క్రేజ్.. కప్ గెలిచింది బెంగళూరు.. సంబరాలు చేసుకుంది పాకిస్థాన్ ఫ్యాన్స్!

సరిహద్దులు దాటిన కోహ్లీ క్రేజ్.. కప్ గెలిచింది బెంగళూరు.. సంబరాలు చేసుకుంది పాకిస్థాన్ ఫ్యాన్స్!

Pakistani RCB Fans: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 టైటిల్ గెలవడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ విజయోత్సవాలు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, శత్రు దేశమైన పాకిస్థాన్‌కు కూడా పాకింది. ఆర్‌సీబీ విజయాన్ని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంతో సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

ఒకవైపు ఆర్‌సీబీ జెర్సీలు, మరోవైపు పాక్ జెర్సీలతో రచ్చ: 
యూఏఈ (UAE) వేదికగా ఉన్న కొందరు పాకిస్థానీ ఫ్యాన్స్.. ఆర్‌సీబీ తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను గెలవగానే అహ్మదాబాద్ స్టేడియంలో ఉన్నట్లే ఊగిపోతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వాళ్లు ఒకవైపు ఆర్‌సీబీ జెర్సీలు, మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ జెర్సీలు ధరించి మరీ ఈ చారిత్రాత్మక విజయాన్ని ఎంజాయ్ చేయడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భారత్– పాకిస్థాన్ మధ్య ఉన్న రాజకీయ, క్రీడా వైరాన్ని పక్కనబెట్టి.. పాక్ ఫ్యాన్స్ ఇలా ఒక ఐపీఎల్ టీమ్ విజయాన్ని పండగలా చేసుకోవడం నెట్టింట అందరినీ షాక్ కి గురి చేస్తుంది.  

సరిహద్దులు దాటిన కింగ్ కోహ్లీ క్రేజ్: 
ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో ఆర్‌సీబీ ఒకటి కావడం వెనుక ఉన్న అసలు కారణం విరాట్ కోహ్లీ.. కింగ్ కోహ్లీకి ఉన్న గ్లోబల్ ఫ్యాన్ బేస్ దేశాల సరిహద్దులను ఎప్పుడో దాటేసింది. ముఖ్యంగా పాకిస్థాన్‌లో కోహ్లీకి అభిమానులు కోట్లల్లో ఉంటారు. ఈ వైరల్ వీడియో కూడా కోహ్లీ బ్రాండ్ ఇమేజ్‌కు, అతనిపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.

సోషల్ మీడియాలో ట్రెండింగ్: 
ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై ఆర్‌సీబీ అద్భుత విజయం సాధించినప్పటి నుంచి నెట్టింట బెంగళూరు జట్టు సెలబ్రేషన్స్ వీడియోలే టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో అభిమానులు రోడ్లపైకి వచ్చి రచ్చ చేసిన విజువల్స్ ఒకవైపు, ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ స్పందనలు మరోవైపు ఐపీఎల్ 2026 వైబ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.