‘పబ్జీ’ ప్రేమ వెనుక గూఢచర్యం?.. సీమా హైదర్.. పాక్ ఏజెంటా?

‘పబ్జీ’ ప్రేమ వెనుక గూఢచర్యం?.. సీమా హైదర్.. పాక్ ఏజెంటా?

న్యూఢిల్లీ: ప్రేమంటూ మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుడితో కలిసి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సీమా హైదర్(30) కేసు మలుపులు తిరుగుతోంది. ఆమెది నిజంగా ప్రేమేనా? మన దేశంలోకి అడుగుపెట్టేందుకు నాటకమాడిందా? టెర్రరిస్టులు, పాకిస్తాన్ ఆర్మీ కోసం పని చేస్తున్నదా? అని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అనుమానిస్తున్నది. ఇప్పుడీ కోణంలోనే కేసు దర్యాప్తు చేస్తున్నది. 

సీమా అంకుల్​తో పాటు, ఆమె సోదరుడు కూడా పాకిస్తాన్ ఆర్మీలో పని చేస్తున్నాడని తాజాగా వెల్లడైంది. దీంతో సీమా ఐఎస్ఐ గూఢచారి కావొచ్చని ఏటీఎస్ అనుమానిస్తున్నది. సీమా ఐడెంటిటీ కార్డును పాకిస్తాన్ లోని ఇండియన్ హైకమిషన్ కు పంపించి వెరిఫై చేయించాలని భావిస్తున్నది. ఆమె పూర్తి ప్రొఫైల్ ను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు పాకిస్తాన్ లోని తన ప్రాపర్టీని అమ్మి ఇండియాకు వచ్చానని సీమా దర్యాప్తులో చెప్పింది. 

మొదట దుబాయ్ వెళ్లి, అక్కడి నుంచి నేపాల్ మీదుగా దేశంలోకి వచ్చినట్టు తెలిపింది. సీమాకు నిజంగా చదువు రాకపోతే.. ఇవన్నీ చేయడం ఎలా సాధ్యం? అని ఏటీఎస్ ఆశ్చర్యపోతున్నది. దీని వెనుక ఇంకెవరో ఉన్నారని,  ఆమెకు ఎవరో సహకరించి ఉంటారని అనుమానిస్తున్నది. లేదంటే ఆమె బాగా చదువుకున్నదై ఉంటుందని భావిస్తున్నది. 

మరోసారి విచారణ.. 

ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ మీనా (22)తో తరచూ ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడిన సీమా హైదర్.. అతనితో ప్రేమలో పడింది. తన నలుగురు పిల్లలను తీసుకుని ఇండియాకు వచ్చేసింది. ఈ క్రమంలో అక్రమంగా దేశంలోకి వచ్చినందుకు సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్ ను ఈ నెల 4న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వాళ్లిద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా, ఇటీవల లక్నోలో పాకిస్తాన్ అనుమానిత ఏజెంట్​ను ఏటీఎస్ అదుపులోకి తీసుకున్నది. మరోవైపు సీమా.. పాక్ ఏజెంట్ అని, ఆమెను తిరిగి ఆ దేశానికి పంపించాలని ఏటీఎస్ పోలీసులకు బెదిరింపు వచ్చింది. ఈ పరిణామాలతో గూఢచర్యం, టెర్రరిజం కోణంలో ఏటీఎస్ దర్యాప్తు చేస్తున్నది.