ప్రపంచ దేశాలకు పాక్ విజ్ఞప్తి.. 1200 కోట్లు కావాలన్న యూఎన్​

ప్రపంచ దేశాలకు పాక్ విజ్ఞప్తి.. 1200 కోట్లు కావాలన్న యూఎన్​

ఇస్లామాబాద్: వరదలతో నష్టపోయిన తమ దేశానికి రూ.1200 కోట్ల సాయం చేయాలని యునైటెడ్​ నేషన్స్(యూఎన్) తో కలిసి అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్​ విజ్ఞప్తి చేసింది. తమ దేశంలో వరదలకు 1100 మంది చనిపోయారని, 3.3 కోట్ల మంది ప్రభావితమయ్యారని, పంటలు దెబ్బతిన్నాయని పాక్​ తెలిపింది. వరదల్లో పాకిస్తాన్​ కొట్టుకుపోయిందని యూఎన్​ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్​ ఓ వీడియోలో అన్నారు. ‘‘పాక్​ ప్రజలు భయంకరమైన వరదల బారినపడ్డారు.

అంతర్జాతీయ సమాజం ఆర్థిక సాయం చేస్తే కనీసం 50 లక్షల మందికి ఆహారం, నీరు, వైద్యం, పారిశుధ్య సౌకర్యాలు కల్పించవచ్చు” అని గుటెర్రెస్​ పేర్కొన్నారు. వరదల తర్వాత ‘2022  పాకిస్తాన్​ ఫ్లడ్స్​ రెస్పాన్స్​ ప్లాన్’ (ఎఫ్ఆర్​పీ)  ని పాక్​ ప్రభుత్వం, యూఎన్​ కలిసి ప్రారంభించాయి. గ్లోబల్​ వార్మింగ్​ కారణంగా తమ దేశ ఉనికి ప్రమాదంలో పడిందని, సాయంచేయాలని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్​ భుట్టో జర్దారీ కోరారు. 

3.3 కోట్ల మందిపై ప్రభావం

వరదల వల్ల 3.3 కోట్ల మంది, 72 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, చిన్న దేశంతో ఇది సమానమని బిలావల్​ భుట్టో తెలిపారు. వరదల కారణంగా వేలమంది నిరాశ్రయులయ్యారని, బాధితులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆరుబయట గడిపారని ఆయన చెప్పారు. ‘‘బాధితుల కోసం ఇప్పటికే రూ.1300 కోట్లు కేటాయించాం. రిలీఫ్​ యాక్టివిటీస్​ కోసం రూ.500 కోట్లను నేషనల్​ 
డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ అథారిటీకి కేటాయించినం. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు చెరో పది లక్షలు, గాయపడిన వారికి, ఇండ్లు దెబ్బతిన్న వారికి తలా రెండున్నర లక్షలు ఇస్తున్నం. ఇండ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలిస్తున్నం” అని బిలావల్​ వివరించారు. కాగా, పాక్​కు వరద సాయం కింద రూ.39 కోట్లు ఇస్తామని కెనడా ప్రకటించింది. సాయం చేస్తామని చైనా పేర్కొంది.

నేషనల్​ డిజస్టర్​ ఏజెన్సీ ఏర్పాటు

భీకర వరదల వల్ల సంభవించిన నష్టాన్ని ఎదుర్కొనేందుకు పాక్​ ప్రభుత్వం నేషనల్​ డిజాస్టర్​ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ఈ ఏజెన్సీ ద్వారా వరద బాధితులకు ఆర్థిక సాయం చేయనుంది.