మైనారిటీలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి పాక్​లోనే లేదు

మైనారిటీలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి పాక్​లోనే లేదు

న్యూయార్క్:  ఐక్యరాజ్యసమితిలో తరచూ మన దేశంపై తప్పుడు ప్రచారం చేసే పాకిస్తాన్​కు కేంద్రం మరోసారి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. జమ్మూకాశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(యూఎన్​హెచ్చార్సీ)లో పాకిస్తాన్ ప్రతినిధి హీనా రబ్బానీ ఖర్ గురువారం చేసిన కామెంట్లకు మన ప్రతినిధి సీమా పుజని దీటుగా బదులిచ్చారు. పాకిస్తాన్​లోనే మైనారిటీలకు రిలీజియస్ ఫ్రీడమ్ లేదని, వారు స్వేచ్ఛగా బతికే పరిస్థితిలేదని శుక్రవారం యూఎన్ హెచ్చార్సీలో ఆమె ఫైర్ అయ్యారు. ‘‘పాకిస్తాన్​లో నేడు మతపరమైన మైనారిటీలు ఎవరూ స్వేచ్ఛగా తమ మతాన్ని పాటించే పరిస్థితి లేదు. అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సైతం వారి మతాన్ని పాటించడం వల్ల ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేస్తోంది. ఇండియాపై బురద చల్లాలన్న ఎజెండాతో పాక్ ప్రతినిధి మరోసారి ఈ వేదికను దుర్వినియోగం చేశారు” అని ఆమె దుయ్యబట్టారు. పాక్​లో క్రిస్టియన్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. క్రిస్టియన్లను తరచూ దైవదూషణ చట్టాలతో టార్గెట్ చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వ సంస్థల్లో అధికారికంగానే వారిని శానిటేషన్ ఉద్యోగాలకు రిజర్వ్ చేస్తున్నారని తెలిపారు. 

బలవంతంగా మతమార్పిడులు 

మైనారిటీ వర్గం బాలికలను బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారని అయినా, అక్కడి ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మాత్రం చోద్యం చూస్తూ ఉంటాయని సీమ మండిపడ్డారు. హిందూ, సిక్కు కమ్యూనిటీల బాలికలు తరచూ ఇలాంటి దాడులను ఎదుర్కొంటున్నారని అన్నారు. మైనారిటీల ప్రార్థనా స్థలాలపై కూడా తరచూ దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వానికి, మిలిటరీకి వ్యతిరేకంగా గొంతెత్తే పరిస్థితి అక్కడ లేదన్నారు. వాటిపై జోకులు వేసినా, ఆరోపణలు చేసినా ఐదేండ్ల జైలుశిక్ష వేయాలని ప్రతిపాదించిన ఓ బిల్లు ఇప్పుడు ఆ దేశ పార్లమెంట్ ముందు ఉందన్నారు. 

బలూచిస్తాన్​లో పాక్ అణచివేతలు 

పాకిస్తాన్​లో ప్రభుత్వమే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పేరుతో ఎంతో మందిని కిడ్నాప్ చేస్తూ, మాయం చేస్తోందని సీమా పుజని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలపై గత పదేండ్లలో 8,463 కంప్లయింట్లు ఉన్నాయన్నారు. ఈ క్రూరమైన విధానానికి  లూచిస్తాన్ ప్రజలు బలైపోతున్నారని చెప్పారు. స్టూడెంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, కమ్యూనిటీ లీడర్లను ప్రభుత్వమే మాయం చేస్తోందని, వారు ఇక ఎప్పటికీ తిరిగిరాలేరని చెప్పారు. పాక్ ప్రభుత్వం స్వయంగా టెర్రరిజానికి సపోర్ట్ చేస్తోందన్నారు. భద్రతా సంస్థలే హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి టెర్రరిస్టులను దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్నాయన్నారు. యూఎన్ ఎస్ సీ టెర్రరిస్టులుగా ముద్రవేసిన వ్యక్తులు సైతం పాక్​లో పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. గతంలో లాడెన్ మిలిటరీ అకాడమీకి సమీపంలోనే షెల్టర్ పొందిన విషయాన్ని గుర్తుచేశారు. టెర్రరిజానికి పాక్ సపోర్ట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వేలాది మరణాలకు కారణం అయిందన్నారు.  

ముందు మీ ప్రజలను పట్టించుకోండి  

పాక్ ప్రజలు కనీస జీవనాధారం లేకుండా అల్లాడుతుంటే ఆ దేశం మాత్రం ఇండియాపై తప్పుడు ప్రచారం చేయడంపైనే దృష్టి పెట్టిందని సీమా దుయ్యబట్టారు. ‘‘పాక్ ప్రజలు తమ జీవనాధారం, స్వేచ్ఛ కోసం పోరాడుతుండటం ఆ దేశ తప్పుడు ప్రయారిటీలకు నిదర్శనం. ఇండియాపై నిరాధార ప్రచారం చేయడానికి బదులుగా సొంత ప్రజల ప్రయోజనం కోసం పనిచేయాలని పాక్ నాయకత్వానికి, అధికారులకు నేను సలహా ఇస్తున్నా” అని ఆమె చురక వేశారు. జమ్మూకాశ్మీర్ అంశంపై టర్కీ ప్రతినిధి, ఆర్గనైజేషన్ ఆఫ్ ​ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) చేసిన కామెంట్లపైనా విచారం వ్యక్తంచేశారు. ఇండియా అంతర్గత వ్యవహారాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ ఎప్పటికీ ఇండియాలో అంతర్భాగమేనని స్పష్టంచేశారు.