V6 News

ఇది బైపాస్ రోడ్డా? డంపింగ్ యార్డా?...పాలమూరు బైపాస్ రోడ్డు పొడవునా చెత్త కుప్పలే..

ఇది బైపాస్ రోడ్డా?  డంపింగ్ యార్డా?...పాలమూరు బైపాస్ రోడ్డు పొడవునా చెత్త కుప్పలే..
  •     ఎక్కడికక్కడ పేరుకుపోయిన ప్లాస్టిక్​ కవర్లు   మెయింటెనెన్స్​ను గాలికొదిలేసిన ఆఫీసర్లు
  •     రాత్రయితే స్మోకర్లు, తాగుబోతులకు అడ్డాగా మారుతున్న రోడ్డు

మహబూబ్​నగర్, వెలుగు : మహబూబ్​నగర్​ నగరంలో ట్రాఫిక్​ సమస్యను అధిగమించేందుకు నిర్మించిన టౌన్​ బై పాస్ రోడ్డు డంపింగ్​ యార్డును తలపిస్తోంది. రోజూ వందల కొద్దీ వాహనాలు వెళ్లే ఈ మార్గంలో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. రోడ్డు పొడవునా ప్లాస్టిక్​ కవర్లు నిండిపోయాయి. మెయింటెనెన్స్​ గాలికొదిలేయడంతో ఈదురు గాలులకు కవర్లు, చెత్త మొత్తం రోడ్డు మీదకు కొట్టుకొస్తున్నాయి.

అడుగుకో చెత్త కుప్ప..

టౌన్​ బై పాస్​ వద్ద రెండు నెలలుగా చెత్త పేరుకుపోయింది. ఈ బై పాస్​ నాలుగున్నర కిలోమీటర్ల మేర ఉండగా, ఎదిర క్రాస్​ రోడ్డు ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి బై పాస్​ ఎండ్​ వరకు  చెత్త నిండిపోయింది. ప్రధానంగా ఈ బై పాస్​రోడ్డు వెంట ఇటీవల 70కిపైగా వివిధ రకాల హోటళ్లు, చాయ్​ దుకాణాలు ఏర్పాటయ్యాయి. అయితే వీటి నిర్వాహకులు దుకాణాల్లోన్ని చెత్తను ఈ బై పాస్​ పక్కనే పారబోస్తున్నారు. తెల్లవారుజామున వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన ఇండ్ల శిథిలాలను సైతం గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ కుప్పలుగా పోసి వెళ్తున్నారు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించే వారు సైతం రోడ్డు పక్కనే పారబోస్తున్నారు. సమీప కాలనీల్లో చనిపోయిన కుక్క కళేబరాలను ఇక్కడే విడిచి వెళ్తున్నారు. దీంతో టౌన్​ బై పాస్​ ప్రాంతం డంపింగ్​ యార్డులా మారిపోతోంది. 

పట్టించుకోకుంటే ప్రమాదమే..

బై పాస్ పక్కన చెత్త వేయడాన్ని వెంటనే నిలిపివేయకపోతే ఇబ్బందులు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు. చెత్త కుప్పల వద్ద ఆవులు, కుక్కలు, పందులు ఆహారం కోసం చేరతాయి. ఆకస్మాత్తుగా అవి రోడ్డు మీదకు వస్తే  వాహనాలు ఢీ కొనే ప్రమాదం ఉంది. పెద్ద చెత్త కుప్పలు, దుమ్ము వల్ల డ్రైవర్లకు ముందున్న రోడ్డు స్పష్టంగా కనిపించక ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్​ టేక్​ చేసే సమయంలో ఢీ కొనే ప్రమాదం ఉంది.  ఈదురు గాలులకు ప్లాస్టిక్​, ఇతర వస్తువులు రోడ్డు మీదకు చేరితే టూ వీలర్లు స్కిడ్​ అవుతాయి. చెత్త కుప్పలు పెరిగి రోడ్డులోకి వస్తే రోడ్డు వెడల్పు తగ్గి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. చెత్త కుప్పల్లో గాజు ముక్కలు, మెటల్, కెమికల్ వ్యర్థాలు ఉంటే టైర్లు పంక్చర్ కావడం, పేలిపోవడం, వెహికల్​ కంట్రోల్ తప్పి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. 

స్మోకర్లు, తాగుబోతులకు అడ్డాగా..

టౌన్​ బైపాస్​ సిగరెట్​ స్మోకర్లు, తాగుబోతులకు అడ్డగా మారింది. రాత్రి ఏడు దాటితే చాలు.. బైపాస్​ సమీపంలో ఉన్న కొన్ని ప్రైవేట్​ విద్యా సంస్థలకు చెందిన స్టూడెంట్లు, నగరానికి చెందిన యువత ఇక్కడకు వచ్చి ​ పేరుతో హంగామా చేస్తున్నారు. కొందరు రాత్రి పది గంటలు దాటిన తర్వాత కూడా రోడ్డు పక్కనే నిలబడి బర్త్​ డే కేకులు  కట్​ చేస్తూ న్యూసెన్స్​ క్రియేట్​ చేస్తున్నారు. స్టూడెంట్లు ఆడ, మగ తేడా లేకుండా అర్ధరాత్రి వరకు సిగరెట్లు తాగుతూ జల్సా చేస్తున్నారు. . రోడ్డు పక్కనే వాహనాలను గంటలకొద్దీ నిలిపి ఉంచుతున్నారు. రోడ్డుపక్కనే పెద్ద సంఖ్యలో కండోమ్స్​ కనిపిస్తున్నాయి. తాగిన  సీసాలనూ రోడ్డు పక్కనే పడేసి వెళ్తున్నారు

మెయింటెనెన్స్​ ఎవరిదీ?

టౌన్​ బై పాస్​ను మేంటెనెన్స్​ను ఏ డిపార్ట్​మెంట్​ చూస్తుందో ఇంత వరకు స్పష్టత రాలేదు. ‘వి6 వెలుగు’ బై పాస్​ వెంట పేరుకుపోయిన చెత్త విషయాన్ని నగర పాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా,  బై పాస్​ తమ పరిధిలోకి రాదని సమాధానం ఇచ్చారు. అయితే ఈ బై పాస్​ ఆర్​ అండ్​ బీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడంతో ఆ శాఖ ఉన్నతాధికారులను వివరణ కోరే ప్రయత్నం చేయగా, వారు అందుబాటులోకి రాలేదు.