రైతులకు శిక్షణ లేదు.. కొత్త వంగడాల ఉత్పత్తి లేదు

రైతులకు శిక్షణ లేదు.. కొత్త వంగడాల ఉత్పత్తి లేదు

వనపర్తి, వెలుగు:భారత వ్యవసాయ పరిశోధర కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ కోసం ఏర్పాటైన పాలమూరు కృషి విజ్ఞాన కేంద్రం కొత్త ప్రాజెక్టులు లేక వెలవెలబోతోంది.  వనపర్తి జిల్లాలోని మదనాపురంలోని 1993లో  50 ఎకరాల్లో ఏర్పాటైన దీని బాధ్యతను యూత్ ఫర్ యాక్షన్  స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది.  కేవీకే ఆధ్వర్యంలో గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్‌‌‌‌‌‌‌‌లో ఆరుతడి పంటలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించేవారు.  బయో ల్యాబ్ పథకం ద్వారా  మేలైన టేకు, వేప, అరటి లాంటి మొక్కలను ఉత్పత్తి(టిష్యూ కల్చర్) చేసి రైతులకు సరఫరా చేసేవారు.  వీటితో పాటు మామిడి, నిమ్మ, బత్తాయి. సపోటా, జామ మొక్కలకు అంట్లు గట్టి తక్కువ ధరకే రైతులకు ఇచ్చేవారు. కానీ,  తెలంగాణ ఏర్పాటు తర్వాత దీన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. 

నిర్వహణకు కూడా పైసల్లేవ్

కేవీకేలో ప్రస్తుతం ఆరుగురు సైంటిస్టులతో పాటు మరో 10 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతి నెలా ఐకార్ నుంచి వేతనాలు అందుతున్నాయి. అయితే  ఎనిమిదేండ్లుగా కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావడం లేదు.  దీంతో కేవీకే నిర్వహణ కూడా కష్టంగా మారింది. ఇక్కడ పనిచేసే కూలీలు, ఇతర అవసరాలకు కోసం కూడా డబ్బులు ఉండడం లేదు.  ఇక్కడి సైంటిస్టులు నర్సరీల్లో మొక్కల పెంపకంతో పాటు వర్మీ కంపోస్ట్‌‌‌‌ను ఉత్పత్తి చేసి స్థానిక రైతులకు అమ్ముతూ కేవీకేను నడిపిస్తున్నారు.  

ప్రత్యామ్నాయ పంటలెట్ల?

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతున్నా సర్కారు.. అందుకు కావాల్సిన విత్తనాలు, మొక్కలపై దృష్టి పెట్టడం లేదు.  కేవీకే ఉన్నదే ఆరుతడి, పండ్ల తోటలను ప్రోత్సహించేందుకని, ఫండ్స్‌‌‌‌, ప్రాజెక్టులు ఇవ్వకపోతే తాము మాత్రం ఏం చేస్తామని సైంటిస్టులు అంటున్నారు. తమకు ఏ ప్రాజెక్టులు అప్పజెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని,  తమ వద్దకు వస్తున్న ఎంతో మంది రైతులకు ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నామన్నారు.  కాగా, కేవీకే ఎన్జీవో చేతిలో ఉండడంతో ప్రభుత్వం గతంలోనే జయశంకర్ వర్సిటీలో కలిపేందుకు యత్నించింది. కానీ, ఇందుకు యూత్  ఫర్ యాక్షన్ సంస్థ ఇందుకు ఒప్పుకోలేదు.  

మామిడిలో 15 రకాల మొక్కలు దొరుకుతుండే

కేవీకేలో గతంలో 10 నుంచి 15 రకాల మామిడి రకాల మొక్కలు దొరికేవి. నిమ్మ, బత్తాయి వంటి మేలు రకం మొక్కలు అంటు కట్టి ఇచ్చేవారు. ఇప్పుడు తోటలు సాగు చేయాలంటే ప్రైవేట్ నర్సరీలపై ఆధారపడాల్సి వస్తోంది.  కేవీకే కొత్త ప్రాజెక్ట్ లు అప్పగిస్తే ఈ ప్రాంతంలో సేద్యం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు సాగునీటి వసతులు కూడా పెరగడం కలిసి వస్తది. 
– సత్యనారాయణ, నరసింగాపురం, రైతు

రైతులకు శిక్షణ ఇస్తున్నం

మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రంలో సాగు పద్ధతులు, కొత్త వంగడాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నం.  ప్రభుత్వం నుంచి కొత్త ప్రాజెక్ట్ లు కేవీకే కు  ఇవ్వలేదు. 50 ఎకరాల విస్తీర్ణంలో పలు రకాల తోటలు పెంచి రైతులకు అవగాహన కల్పిస్తున్నం. ఇతర ప్రాజెక్ట్ లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది.
–సుధాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి, వనపర్తి