పాలమూరు యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం..

పాలమూరు యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం..
  • రేపు పాలమూరు యూనివర్సిటీ నాల్గో కాన్వొకేషన్​
  • హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్​ శర్మ
  • పారిశ్రామిక వేత్త ఎంఎస్ఎన్ రెడ్డి గౌరవ డాక్టరేట్​కు ఎంపిక
  • 83 మందికి గోల్డ్​ మెడల్స్​అందిచనున్న గవర్నర్​
  • కార్యక్రమాన్ని సక్సెస్​ చేయడానికి ఆర్గనైజేషన్ కమిటీ నియామకం 

మహబూబ్​నగర్​/ మహబూబ్​నగర్ రూరల్, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ నాల్గో స్నాతకోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. గురువారం వర్సిటీలోని లైబ్రరీ ఆడిటోరియంలో  పీయూ స్నాతకోత్సవం జరుగనుంది. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్​జిష్ణుదేశ్ శర్మ చీఫ్ గెస్ట్​గా హాజరకానున్నారు. ఈ ప్రోగ్రామ్​ను సక్సెస్ చేసేందుకు అన్ని డిపార్ట్​మెంట్లను సమన్వయం చేస్తూ ఆర్గనైజింగ్ కమిటీలను నియమించారు. 

ఎంఎస్ఎన్ రెడ్డికి గౌవర డాక్టరేట్.. 

పాలమూరు వర్సిటీలో మూడు సార్లు స్నాతకోత్సవం జరిగింది. నాల్గో సారి జరుగనున్న స్నాతకోత్సవంలో మొదటిసారి ప్రముఖ వ్యక్తికి గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. మహబూబ్​నగర్ జిల్లా నవాబుపేట మండలానికి చెందిన ఎంఎస్ఎన్​ల్యాబోరేటరీస్​అధినేత మన్నె సత్యనారాయణరెడ్డి (ఎంఎస్ఎన్​ రెడ్డి)కి డాక్టరేట్​ఇవ్వనున్నారు. గవర్నర్​ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్​ అందుకుంటారు. 

12 మందికి పీహెచ్​డీ పట్టాలు, 83 మందికి గోల్డ్​మెడల్స్..

ఆయా విభాగాల్లో పీహెచ్​డీలు పూర్తి చేసిన 12 మందికి పట్టాలు అందించనున్నారు. మైక్రోబయాలజి విభాగంలో చేతన, సంజీవ్​ కుమార్, శ్రీనివాసరావు, విజయ్​కుమార్, రాజశ్రీనాథ్, కెమిస్ర్టీ విభాగంలో రుకియాభాను, సంధ్య, టి.స్వాతి, డి.వెంకటేశ్, జి.విజయలక్ష్మి, కామర్స్​లో రితికా, బిజినెస్ మేనేజ్​మెంట్​లో సంధ్యారాణి పీహెచ్​డీ పట్టాలు అందుకోనున్నారు.

 ప్రతి విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన 83 మందికి గోల్డ్​మెడల్స్ అందుకోనున్నారు. వీరితోపాటు పీజీలో 2,809 మంది, ప్రొఫెషనల్​ కోర్సుల్లో 8,921 మంది, 18,666 మందికి యూజీ డిగ్రీలను ప్రదానం చేయనున్నారు.

కమిటీలు ఇలా..

స్నాతకోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్​గా వైస్ చాన్సలర్ జీఎన్​శ్రీనివాస్ వ్యవహరించనున్నారు. వైస్ చైర్మన్​గా రిజిస్ర్టార్ రమేశ్ బాబు, కోఆర్డినేటర్​గా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కె.ప్రవీణ, మరో 11 మందిని కోర్ కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీతోపాటు మరో ఎనిమిది సబ్ కమిటీలను నియమించారు. 

ఒక్కో కమిటీలో ఆరు నుంచి తొమ్మిది మంది ఉంటారు. మెటీరియల్​/కంటెంట్ డెవలప్​మెంట్​కమిటీ, గోల్డ్ మెడల్స్​/సర్టిఫికెట్స్ కమిటీ, ఫెసిలిటేషన్ కమిటీ, హాస్పిటాలిటీ/ట్రాన్స్​పోర్టేషన్​ కమిటీ, స్టేజ్​/ఆడిటోరియం మేనేజ్​మెంట్​కమిటీ, ఫైనాన్స్​కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ కమిటీలు ఉంటాయి. 

మూడు సార్లు స్నాతకోత్సవం ఇలా..

సంవత్సరం     పీహెచ్​డీలు    గోల్డ్​ మెడల్స్​    యుజీ/పీజీ పట్టాలు

 పొందిన వారు    పొందిన వారు    పొందిన వారు

2014         00        56        7636
2019         00        115      14675
2022         06        71        33577