కంపు గొడ్తున్న .. పాలమూరు వర్సిటీ

కంపు గొడ్తున్న .. పాలమూరు వర్సిటీ
  •   బాయ్స్​ న్యూ పీజీ హాస్టల్​లో డ్రైనేజీ లీక్ 
  •     సింకులు బ్లాక్  అయి హాస్టల్  గదుల్లో నీరు
  •     క్యాంపస్​లో పందుల స్వైర విహారం
  •     స్టూడెంట్లు ఆందోళనలు చేసినా పట్టించుకోని అధికారులు

మహబూబ్​నగర్/మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ (పీయూ) సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. డ్రైనేజీలు, వాటర్​ ట్యాంకుల నుంచి నీరు పది రోజులుగా లీకవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లీక్  అవుతున్న నీరు హాస్టల్​ గదుల్లోకి చేరుతుండడంతో స్టూడెంట్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీల లీకేజీతో హాస్టళ్ల పరిసర ప్రాంతమంతా కంపు వాసన వస్తోందని స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వర్సిటీలో బాయ్స్  న్యూ పీజీ హాస్టల్​ను కొన్ని నెలల కిందట ఓపెన్​ చేశారు. మొత్తం రెండు ఫ్లోర్లు ఉండగా, ఫ్లోర్​కు 12 గదుల చొప్పున 36  రూమ్స్​ ఉన్నాయి. ఈ గదుల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడీ (ఇంటిగ్రేటెడ్​ కెమిస్ట్రీ), ఫార్మసీ స్టూడెంట్లు 180 మంది ఉంటున్నారు.

అయితే ఈ హాస్టల్​లో సింకులు నిండిపోయి కొద్ది రోజులుగా సమస్య తీవ్రంగా మారింది. గ్రౌండ్​ ఫ్లోర్​లో సింకులు జామ్​ కావడంతో నీరు బయటకు పోవడం లేదు. ఫస్ట్​ ఫ్లోర్, సెకండ్​ ఫ్లోర్​లో వాష్​ బేసిన్​లు, సింకుల నుంచి వస్తున్న నీరు మొత్తం గ్రౌండ్​ ఫ్లోర్​లోనే ఆగిపోతోంది. దీంతో ఆ నీరంతా జామ్​ అవుతుండటంతో గ్రౌండ్​ ఫ్లోర్​లోకి నీళ్లు వస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈ సమస్య ఉండడంతో గ్రౌండ్​ ఫ్లోర్​లోని గోడలకు మొత్తం తంపు వచ్చింది.  పైప్ లైన్​కు దగ్గర్లో ఉన్న రూముల్లోకి ఈ నీరు చేరింది. దీంతో గదుల్లో స్టూడెంట్లు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే పది రోజులుగా హాస్టల్​ పైభాగంలో ఉన్న వాటర్​ ట్యాంక్​ నుంచీ నీరు లీక్  అవుతోంది. రోజుల తరబడి నీళ్లు వృధాగా  పోతోంది. ఈ నీరు కూడా గోడల పొంటి కారుతుండటంతో తంపు వస్తోంది. చలికాలం కావడంతో గోడలకు తంపు పెరిగి స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు.

డ్రైనేజీ అస్తవ్యస్తం.. పెరిగిన పందుల బెడద

హాస్టల్  నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని అండర్​ గ్రౌండ్​ సిస్టం ద్వారా సమీపంలో ప్రత్యేకంగా తవ్విన కుంటలోకి వదులుతున్నారు. మధ్యలో ఓ చోట డ్రైనేజీ నీరు పోయే మ్యాన్​ హోల్​ నుంచి పెద్ద మొత్తంలో మురుగు నీరు లీకవుతోంది. దాంతో  హాస్టల్​  చుట్టుపక్కల భరించలేని దుర్గంధం వెలువడుతోంది. అలాగే వర్సిటీలో స్ర్టీట్​ లైట్లు కూడా వెలగడం లేదు. చిమ్మచీకటిగా ఉంటుండడంతో రాత్రిపూట స్టూడెంట్లు బయటకు రావడం లేదు. ఈ విషయంపై మున్సిపాల్టీకి పీయూ సిబ్బంది పలుమార్లు కంప్లైంట్​ చేసినా ఇంత వరకు పరిష్కరించలేదు.

ఇక వర్సిటీ పరిసరాల్లో పందుల బెడద బాగా పెరిగింది. హాస్టళ్లు, క్యాంపస్​ చుట్టూ నిత్యం పందులు తిరుగుతుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వర్సిటీలు సమస్యలు పరిష్కరించాలని స్టూండెంట్లు, స్టూడెంట్​ యూనియన్  లీడర్లు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పలుమార్లు వీసీకి వినతిపత్రాలు ఇచ్చినా ఇంత వరకూ స్పందించలేదు.

రూమ్​లో గలీజ్​ వాసన వస్తున్నది​

సింకుల నుంచి కొద్ది రోజులుగా వాటర్​ లీక్  అవుతోంది. ఈ నీరు మొత్తం హాస్టల్​ గదుల్లోకి  వస్తోంది. దీంతో రూములు గలీజ్​ వాసన కొడుతున్నయి. ఈ విషయంపై కంప్లైంట్​ ఇచ్చినా ఇంత వరకు సమస్యను పరిష్కరించలేదు.
- అర్జున్, ఎంబీఏ సెకండియర్​ స్టూడెంట్, పీయూ

పందుల సమస్య ఉంది  

వర్సిటీలో పందుల సమస్య ఉంది. మున్సిపాలిటీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకంటలే. అలాగే వాటర్  లీకేజీ సమస్యలు ఉన్నాయి. త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. స్టూడెంట్లు టిఫిన్లు, భోజనాల తర్వాత చేతులు సింకుల్లో కడిగేటప్పుడు అన్నం వేస్తున్నారు. దాంతో నీరు జామై బయటకు వస్తోంది.
- ప్రొఫెసర్​ లక్ష్మీకాంత్​ రాథోడ్​, వీసీ​, పీయూ