న్యూఢిల్లీ : షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంజినీరింగ్ నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఏఐఎల్) రూ.5,430 కోట్లు సేకరించేందుకు ఈ నెల 25న పబ్లిక్ ఆఫర్‌ను మొదలుపెట్టనుంది. ఇది అక్టోబర్ 29న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ అక్టోబర్ 24న ఒక రోజు ఉంటుంది. కంపెనీ వచ్చే వారం ఐపీఓ కోసం ప్రైస్ బ్యాండ్‌ను ప్రకటించనుంది. ఈ ఐపీఓలో రూ. 1,250 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూతోపాటు ప్రమోటర్ గోస్వామి ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ. 4,180 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది.
ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు మహారాష్ట్రకు చెందిన ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 99 శాతం వాటా ఉంది. కంపెనీ తాజా ఇష్యూ ద్వారా వచ్చిన దాంట్లో రూ.80 కోట్లను నిర్మాణ సామగ్రి కొనుగోలుకు, రూ. 320 కోట్లను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌కు, రూ. 600 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఇదిలా ఉంటే, రక్షణ పరికరాల తయారీ సంస్థ ఎస్‌ఎమ్‌పీపీ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) ద్వారా రూ. 4,000 కోట్లను సమీకరించేందుకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి డాక్యుమెంట్లను అందజేసింది. ఐపీఓలో తాజాగా రూ. 580 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల ఇష్యూ ప్రమోటర్ శివ్ చంద్ కన్సల్ ద్వారా రూ. 3,420 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీలో కన్సల్‌కు 50 శాతం వాటా ఉంది.