ప్రకటించిన ఏఐసీసీ.. నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్‌లో గుర్తింపు: స్రవంతి
హైదరాబాద్ / నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముకుల్‌వాస్నిక్ శుక్రవారం ప్రకటన రిలీజ్ చేశారు. మాజీ ఎంపీ, సీనియర్ నేత దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురైన స్రవంతి.. మునుగోడు రేసులో ముందు నుంచీ ఉన్నారు. మరో ముగ్గురు అభ్యర్థులతో పోటీ పడి ఆమె టికెట్ దక్కించుకున్నారు. 2014లో మునుగోడు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆమె రెండో స్థానంలో నిలిచారు. వృత్తిరీత్యా లాయర్ అయిన స్రవంతి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001లో పీసీసీ సభ్యురాలిగా, 2005లో ఏఐసీసీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్‌లో ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. మునుగోడు అభ్యర్థిగా ఎంపికైన స్రవంతికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇక, అభ్యర్థి ప్రకటన పూర్తి కావడంతో ప్రచారంపై పీసీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యనేతలు శనివారం గాంధీభవన్‌లో భేటీ కానున్నారు.
2014 ఎన్నికల్లో స్రవంతి మునుగోడు టికెట్ ఆశించారు. ఆ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు ఉండడంతో కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కలేదు. దీంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 27,441 ఓట్లు పడ్డాయి. సీపీఐ అభ్యర్థి పల్లా వెంకటరెడ్డి ఓడిపోయారు. స్రవంతి రెబల్‌గా పోటీ చేయడంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. తిరిగి 2018 ఎన్నికల్లో మరోసారి టికెట్ కోసం స్రవంతి ప్రయత్నించారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో స్రవంతికి మరోసారి అవకాశం చేజారింది. అయితే ఈ సారి కూడా మునుగోడు టికెట్ కోసం చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్నా కైలాష్ పోటీ పడ్డారు. అధిష్టానం స్రవంతి వైపే మొగ్గు చూపింది.
ఐదు సార్లు గెలిచిన గోవర్ధన్‌రెడ్డి..
1967 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో మునుగోడులో ఆరు సార్లు కాంగ్రెస్ గెలిచింది. 1967 నుంచి 1983 వరకు వరుసగా 4 సార్లు గోవర్ధన్‌రెడ్డి గెలిచారు. తిరిగి 1999లో మరోసారి విజయం సాధించారు. 1989, 1994, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. రాజ్యసభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. 2009 ఎన్నికల్లో గోవర్ధన్‌రెడ్డి ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది.
