పాల్వంచ, వెలుగు : వైద్య సేవలకు సంబంధించిన ధరల పట్టిక, ల్యాబ్ లో నిర్వహించే రక్త పరీక్షల ధరల జాబితా రిసెప్షన్ కౌంటర్ వద్ద ఎందుకు ఏర్పాటు చేయ లేదని, ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ల పేర్లు స్పష్టంగా ఎందుకు ప్రదర్శించలేదని, ఆస్పత్రి నిర్వహించే తీరు ఇదేనా అని డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ పాల్వంచలోని విజయ నర్సింగ్ హో మ్ డాక్టర్ విజయలక్ష్మిని ప్రశ్నించారు. ఇటీవల ఆస్పత్రిలో తల్లి గర్భంలోనే శిశువు మృతి చెందిన ఘటనపై తీవ్ర దుమారం రేగింది.
ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డెలివరీ గది అపరిశుభ్రత, మందుల నిల్వ నిర్లక్ష్యంపై ఫైర్ అయ్యారు. పొరపాట్లను వెంటనే సరిదిద్దాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆస్పత్రిని బుధవారం డిప్యూటీ డీఎంహెచ్ వో పరిశీలించగా, మరుసటిరోజే డీఎంహెచ్వో తనిఖీ చేయడం గమనార్హం. ఆయన వెంట డిప్యూటీ పీఎంవో మోహన్ ఉన్నారు.

