మూడు మున్సిపాలిటీలకు ఒక్కరే కమిషనర్

మూడు మున్సిపాలిటీలకు ఒక్కరే కమిషనర్
  • పర్యవేక్షణ లేక.. కుంటుపడ్తున్న పాలన
  • ప్రజలకు అందుబాటులో ఉండక.. సమస్యలు వినే వారు లేక 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మూడు మున్సిపాలిటీలకు ఒక్కరే కమిషనర్ కావడంతో పాలన కుంటుపడుతోంది. కొత్తగూడెం, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు పాల్వంచ మున్సిపల్​ కమిషనర్​ సుజాత ఇన్‌చార్జిగా ఉన్నారు.  దీంతో కమిషనర్​ ఎప్పుడు, ఎక్కడ ఉంటారో తెలియక, సమస్యలు ఎవరికి చెప్పుకోలేక ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. కమిషనర్​ పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 

ఇన్‌చార్జి కమిషనరే దిక్కు.. 

జిల్లాలో కొత్తగూడెం ఒక్కటే గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉంది.  పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలున్నాయి. పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలకు కమిషనర్లున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీకి పాల్వంచ మున్సిపాలిటీ సుజాతను  ఇన్‌చార్జీగా నియమించారు. కొత్తగూడెం మున్సిపల్​ కమిషనర్​గా ఉన్న శేషాంజన్​ స్వామి మూడు నెలల కిందట మాతృస్థంస్థకు వెళ్లిపోయారు. దీంతో గ్రేడ్​1 మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెం మున్సిపాలిటీకి గ్రేడ్​2 మున్సిపాలిటీగా ఉన్న పాల్వంచ కమిషనర్​ సుజాతను​ ఇన్‌చార్జిగా నియమించారు. దీంతో పాల్వంచ కమిషనర్​తో పాటు కొత్తగూడెం, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు ఇన్‌చార్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. 

కుంటుపడ్తున్న పాలన : 

పాల్వంచ నుంచి అశ్వారావుపేటకు దాదాపు 60 కిలోమీటర్ల దూరం. పాల్వంచ నుంచి కొత్తగూడెం 12 కిలోమీటర్ల దూరం. పాల్వంచ మున్సిపల్​ కమిషనర్​ సుజాత అశ్వారావుపేటకు వెళ్లి రావడం కష్ట సాధ్యంగా మారింది. మరో వైపు ప్రభుత్వం రాజీవ్​ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్ల స్కీంలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.  మూడు మున్సిపాలిటీలకు ఒక్కరే కమిషనర్​ కావడంతో అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు మున్సిపాలిటీ ఎదుట ఆందోళనలు చేపట్టారు. అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం, పనులను పర్యవేక్షించడం అంతా కింది స్థాయిలో ఇష్టారాజ్యంగా చేస్తున్నారనే విమర్శలున్నాయి.  పూర్తిస్థాయి కమిషనర్​ లేకపోవడంతో అధికార పార్టీల నేతలతో పాటు కొందరు మాజీ కౌన్సిలర్ల పెత్తనం కొత్తగూడెం మున్సిపాలిటీలో కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్ లోనే.. 

కొత్తగూడెం మున్సిపాలిటీకి 360 ఇందిరమ్మ ఇండ్లు సాంక్షన్ కాగా..  వార్డుకు 10 చొప్పున ఇచ్చేందుకు  ప్లాన్ చేస్తున్నారు.  రాజీవ్ యువ వికాసానికి 2 వేల దరఖాస్తులు రాగా.. లబ్ధిదారుల ఎంపిక ఇంకా పెండింగ్ లోనే ఉంది. అశ్వరావుపేట మున్సిపాలిటీలో రాజీవ్ యువ వికాసం  దరఖాస్తులు 800, ఇందిరమ్మ ఇండ్లకు1600 దరఖాస్తులు రాగా.. ఇంకా ఇండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. పాల్వంచలో ఇందిరమ్మ ఇండ్లు ఎల్ వన్ 1732, ఎల్2లో   4609,  ఎల్3లో   4560 లో పరిశీలనలోనే ఉన్నాయి.   రాజీవ్ యువ వికాసం 3400  దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ అనుకున్న సమయంలో పరిష్కారం కాకపోవడానికి కూడా కమిషనర్ అందుబాటులో లేకపోవడం కారణం అని తెలుస్తోంది. 

సమస్యలు తీర్చే వారే కరవు 

కొత్తగూడెం మున్సిపాలిటీలో వాటర్​ ప్రాబ్లమ్​ గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. పట్టణంలోని బూడిద గడ్డ, కూలీ లైన్​, హనుమాన్​ బస్తీ, రామా టాకీస్​ ఏరియాలతో పలు ప్రాంతాల్లో కిన్నెరసాని నీళ్లు నాలుగైదు రోజులకోసారి సప్లై అవుతున్నాయి.  కొత్తగూడెంలో శానిటేషన్​ అధ్వానంగా మారింది. కొందరు సిబ్బంది పని చేయకున్నా అటెండెన్స్​ వేసుకుంటున్నారనే విమర్శలున్నాయి.   కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్​గా మారుస్తూ ఇటీవలే ప్రభుత్వం గెజిట్​ రిలీజ్​ చేసింది. ఈ క్రమంలో పూర్తి స్థాయి కమిషనర్​ ఉండాల్సిన అవసరం ఉంది. కమిషనర్ ఏదైనా అవసరానికి  ఫోన్ చేస్తే  లిఫ్ట్ చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.  కమిషనర్ ఉంటే సమస్యలు తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.