జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని తిథులు.. కొన్ని నక్షత్రాలు కలిసినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడుతాయి. హిందూ పురాణంలో పంచకకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. . పంచక కాలంలో శుభ అశుభాలు ఏర్పడతాయి. ఎందుకంటే రోగ పంచకము, రాజ పంచకము, అగ్ని పంచకము, మృత్యు పంచకము, చోర పంచకము వంటి వివిధ రకాల పంచకాలున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 27 నక్షత్రాలున్నాయి. వాటిలో చివరి ఐదు నక్షత్రాల (ధనిష్ఠ చివరి సగం, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి) సమూహాన్ని పంచకకాలంగా పరిగణిస్తారు. కుంభం, మీన రాశుల్లో చంద్రుడు సంచారం చేసిన సమయంలో పంచక కాలం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
ఈ ఏడాది (2026) మృత్యు పంచకం జూన్ 6 శనివారం సాయంత్రం 7:03 గంటలకు ప్రారంభమైంది. జూన్ 11న ఉదయం 8:16 గంటలకు ముగుస్తుంది. మృత్యు పంచకంలోని ఈ ఐదు రోజులు చాలా ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. అందువల్ల, ఈ సమయంలో అత్యంత జాగ్రత్త వహించండి. సాధారణంగా శుభకార్యాలకు శనివారం అశుభకరమైనదిగా భావిస్తారు..ఇక పంచకంలో కలిసినప్పుడు ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. పేరులో ఉన్నట్టు మృత్యు పంచకం మరణంతో సమానమైన బాధను కలగజేస్తుంది.
మృత్యం పంచకం సమయంలో ఏం చేయకూడదు
- ఈ 5 రోజుల్లో ( జూన్ 11 వరకు) కలపను సేకరించడం లేదంటే కొనుగోలు చేయడం నిషేధం.
- మంచాలు తయారుచేయకూడదు. ఇంటి పై కప్పు వేయకూడదు.
- దక్షిణ దిశలో ప్రయాణాలు మానుకోవాలి. (దీన్ని యముడి దిక్కుగా భావిస్తారు. )
- మృత్యు పంచక సమయంలో ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
- వాహనాలు నడుపుతున్నప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
- వివాదాలు, గొడవలకు దూరంగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి.
- రిస్క్ తో కూడుకున్న, ప్రమాదకరమైన పనులను వాయిదా వేయడం మంచిదని పెద్దలు చెబుతారు.
- శుభకార్యాలు, మంగళకరమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమమని పురాణాల ద్వారా తెలుస్తుంది.
- ఈ సమయంలో ఎవరైనా మరణిస్తే అదే గ్రామంలో మరో ఐదుగురు మరణిస్తారని నమ్ముతారు. పంచకంలో మరణించిన వ్యక్తికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే దహనానికి ఏర్పాట్లు చేయాలి
- పంచక సమయంలో వివాహిత స్త్రీలు తమ పుట్టింటి నుండి అత్తింటికి గానీ, అత్తగారింటి నుండి పుట్టింటికి గానీ వెళ్లకూడదు. వారు పంచకం రోజులలో ఒకేచోట ఉండాలట.
పంచకం.. పరిహారాలు ఇవే..!
సాయంత్రం పూట హనుమాన్ చాలీసా లేదా సంకట్ మోచన్ హనుమాన్ అష్టకం పఠించండి. ఇది నకారాత్మక శక్తుల నుండి రక్షిస్తుంది. దానధర్మాలు చేయడం మంచిది. ముఖ్యంగా శనివారం నాడు నల్ల నువ్వులు, ఆవాల నూనె లేదా నల్లటి బట్టలు దానం చేయండి. ఇది దుష్ఫలితాలను తగ్గిస్తుంది. దక్షిణ దిశకు సంబంధించిన ఏ ముఖ్యమైన పనులైనా వాయిదా వేయండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద హనుమాన్ చిత్రం లేదా స్వస్తిక్ గుర్తును ఉంచండి. ఇది రక్షణ కవచంగా పనిచేస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం
