ఆ మండలాల్లో రసవత్తర రాజకీయం!.. సొంత మండలాల్లోని గ్రామాల్లో సత్తా చాటేందుకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వ్యూహాలు

ఆ మండలాల్లో  రసవత్తర రాజకీయం!.. సొంత మండలాల్లోని గ్రామాల్లో సత్తా చాటేందుకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వ్యూహాలు
  • ఫస్టు ప్రయారిటీ ఏకగ్రీవాలు.. ఆ తర్వాత గెలుపు గుర్రాలపై ఫోకస్​
  • మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలు 
  • టేకులపల్లి, దమ్మపేట, మణుగూరు, కరకగూడెం, చంచుపల్లి మండలాల్లో హీటెక్కుతున్న పాలిటిక్స్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు సొంత  మండలాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. సొంత మండలాల్లో సత్తా చాటేందుకు  వారు ప్రణాళికలు సిద్ధిం చేస్తున్నారు. గెలిచే సత్తా ఉన్న వారినే ఎంపిక చేస్తున్నారు. ప్రధానంగా దమ్మపేట, ఇల్లెందు మండలాల్లో పొలిటికల్​  హీట్​ రోజు రోజుకూ పెరుగుతోంది. 

ఎమ్మెల్యేలతో పాటు మాజీలకు ప్రతిష్టాత్మకం..

జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు తమ సొంత మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు సవాల్​గా మారాయి. ఇల్లెందు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియ ఇద్దరిదీ టేకులపల్లి మండలమే. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఇద్దరికి ప్రతిష్టాత్మకంగా మారాయి. కోరం కనకయ్య కాంగ్రెస్​ పార్టీలో ఉండగా భానోత్​ హరిప్రియ బీఆర్​ఎస్​లో ఉన్నారు.

 దీంతో టేకులపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. మండలంలో 36 గ్రామ పంచాయతీలున్నాయి. పలు పంచాయతీల్లో ఏకగ్రీవానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యధిక స్థానాల్లో గ్రామపంచాయతీలను గెలుచుకొని సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య వ్యూహాలు పన్నుతున్నారు. ఇదే క్రమంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని తమ ఉనికి చాటుకునేందుకు బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నారు. 

దమ్మపేట మండలంలో మంత్రి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే.. 

అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం కాంగ్రెస్​, బీఆర్​ఎస్​లకు అత్యంత కీలకంగా మారింది. అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రస్తుత కాంగ్రెస్​ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, బీఆర్ఎస్​ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు దమ్మపేట మండలానికి చెందిన వారే కావడంతో ఈ మండలం ప్రత్యేకతను చాటుకుంటుంది. ఈ మండలంలో 31 గ్రామపంచాయతీలున్నాయి. 

మండలంలోని గండుగుల పల్లి గ్రామపంచాయతీ పరిధిలోనే మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో పాటు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నివాసాలున్నాయి. నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రధానంగా దమ్మపేట మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఏకగ్రీవాల కోసం అధికార కాంగ్రెస్​ నేతలు ప్రయత్నిస్తుండగా ఏకగ్రీవాలు కాకుండా అభ్యర్థులను నిలబెట్టేందుకు బీఆర్​ఎస్​ నేతలు సన్నద్ధమవుతున్నారు.  

కొత్తగూడెం నియోజకవర్గం తీరే వేరు.. 

కొత్తగూడెం నియోజకవర్గంలో గ్రామపంచాయతీల ఎన్నికలు అధికార కాంగ్రెస్​తో పాటు సీపీఐ, బీఆర్​ఎస్​కు ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్​ మద్ధతుతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నియోజకవర్గంలోని చుంచుపల్లి మండలం విద్యానగర్​ గ్రామపంచాయతీ పరిధిలోనే నివసిస్తున్నారు. రాష్ట్ర సెక్రటరీగా ఉన్న కూనంనేనితో పాటు సీపీఐ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి. అత్యధిక స్థానాల్లో గ్రామపంచాయతీలను గెలుచుకొని సీపీఐ సత్తా చూపేందుకు ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్​ పాషా పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే పార్టీలతో పొత్తులపై కసరత్తు చేస్తూనే మరో వైపు పంచాయతీల్లో అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

ఇదిలా ఉండగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఈ ఎన్నికలు సవాల్​గా మారాయి. కాంగ్రెస్​ పార్టీ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన ఆయనకు పార్టీలో గత కొంత కాలంగా ప్రతికూలత ఎదురవుతోంది. వనమా గెలుపోటములతో పాటు కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయాలపై పట్టున్న ఆయన కొడుకు వనమా రాఘవేంద్రరావును ఓ కేసు విషయమై పార్టీ సస్పెండ్​ చేసింది. ఈ నియోజకవర్గంలో పార్టీకి వనమా కుటుంబం పెద్ద దిక్కుగా మారింది. బీఆర్​ఎస్​ లో విభేదాల మూలంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వనమా వెంకటేశ్వర రావు వేసే పొలిటికల్​ ఎత్తులపై సర్వత్రా చర్చ సాగుతోంది. 

మణుగురులో పోటాపోటీ.. 

పినపాక నియోజకవర్గంలో ప్రస్తుత కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పంచాయతీ ఎన్నికల్లో పోటాపోటీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో పాయం వెంకటేశ్వర్లు, కరకగూడెం మండలంలో రేగా కాంతారావు నివాసాలుంటున్నారు. తమ సొంత మండలాల్లో మెజార్టీ పంచాయతీలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.