పంచాయతీ ఎన్నికలకు రెడీ.. జిల్లా కేంద్రాలకు చేరుకున్న ఎలక్షన్‌‌ బుక్స్‌‌

పంచాయతీ ఎన్నికలకు రెడీ.. జిల్లా కేంద్రాలకు చేరుకున్న ఎలక్షన్‌‌ బుక్స్‌‌
  • డీపీవో ఆఫీసుల్లో నామినేషన్‌‌ పత్రాలు, ఇతర సామగ్రి
  • మండలాల వారీగా కట్టలు కట్టి పెట్టిన సిబ్బంది

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : పంచాయతీ ఎన్నికలకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఇందుకు అవసరమైన ఎన్నికల సామగ్రి ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని పంచాయతీ ఆఫీస్‌‌‌‌లకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,777 గ్రామ పంచాయతీలు ఉండగా... గతేడాది జనవరి 30తో వాటి పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆఫీసర్లు ఓటరు జాబితా సవరణ సైతం పూర్తి చేసేశారు. 

సర్పంచ్‌‌‌‌లు, వార్డు సభ్యులకు సంబంధించిన ఎలక్షన్‌‌ బుక్కులు ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. డీపీవో ఆఫీసుల్లో ఉన్న నామినేషన్‌‌ పత్రాలు, ఇతర సామగ్రిని మండలాల వారీగా కట్టలు కట్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించగానే, ఎలక్షన్‌‌ కమిషన్‌‌ నోటిఫికేషన్‌‌ ఇచ్చిన వెంటనే ఎన్నికలను నిర్వహించడానికి అంతా రెడీ చేశారు.

ఇప్పటికే పూర్తైన వార్డుల విభజన

ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా వార్డుల విభజన పూర్తి చేసి, ఏయే వార్డుల్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారో లెక్కలు తీశారు. సర్పంచ్‌‌‌‌, వార్డుల వారీగా ఓటర్ల వివరాలను కూడా ప్రకటించారు. జిల్లాల్లో ఇప్పటికే బ్యాలెట్ పెట్టెలు సిద్ధం చేయగా బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా పూర్తయింది. మండలాల వారీగా నామినేషన్‌‌ పత్రాలు, ఇతర సామగ్రిని కట్టలు కట్టి ఉంచారు. 

అలాగే ఎన్నికల సామగ్రిని జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌‌రూమ్‌‌లో భద్రపరిచారు. రిటర్నింగ్‌‌ అధికారులకు ట్రైనింగ్‌‌ ఇవ్వగా, పీవోలు, ఏపీవోలను ఎంపిక చేయగా వారికి ట్రైనింగ్‌‌ ఇవ్వాల్సి ఉంది. తాజాగా మరోమారు తుది ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆఫీసర్లు ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు.